రాబోయేది భారీ బుల్‌ మార్కెట్‌!

A ferocious bull market awaits - Sakshi

మోర్గాన్‌స్టాన్లీ ఇండియా ఎండి

కరోనా సంక్షోభ భయాలు సద్దుమణిగి, ప్రభుత్వ ప్యాకేజీలు ఫలితాలు ఇవ్వడం ఆరంభమైతే ప్రపంచ వ్యాప్తంగా భారీ బుల్‌ మార్కెట్‌ వస్తుందని మోర్గాన్‌స్టాన్లీ ఇండియా ఎండీ రిధమ్‌ దేశాయ్‌ అభిప్రాయపడ్డారు. కోవిడ్‌19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ బలమైన ఉద్దీపనలు తీసుకువచ్చాయని, ఇంత బలమైన పత్రిస్పందన ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం సైతం ప్రపంచ దేశాలు ఇంత పకడ్బందీగా, సమన్వయపూరకంగా స్పందించడం జరగలేదన్నారు. 2008 సంక్షోభం తర్వాత ఇచ్చిన ఉద్దీపనలకన్నా ప్రస్తుత ఉద్దీపనలు ఎన్నో రెట్లు ఎక్కువన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్దీపనలు మార్కెట్లకు ఇచ్చే ఉత్తేజం ఆరంభమవుతుందని, దీంతో అన్ని దేశాల్లో భారీ బుల్‌ ర్యాలీ వస్తుందని అంచనా వేశారు. ఎకానమీలో, సమాజంలో భరోసా తిరిగివస్తే ఈ ప్యాకేజీలన్నీ అద్భుత ఫలితాలిస్తాయన్నారు. ఇందుకోసం ముందుగా కరోనాకు వాక్సిన్‌ కానీ, మందుకానీ కనుక్కోవాల్సిఉంటుందన్నారు. ఒక్కసారి ఈ వైరస్‌కు విరుగుడు వచ్చిందంటే అసెట్‌ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. అయితే విరుగుడు వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు.

లాక్‌డౌన్‌ ముగిసిపోవడమే అతిపెద్ద ప్యాకేజీ
ఎకానమీకి అన్నింటి కన్నా పెద్ద ఉద్దీపన లాక్‌డౌన్‌ ముగిసిపోయి కార్యకలాపాలు ఆరంభం కావడమేనని దేశాయ్‌ చెప్పారు. భారత ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ సామర్ధ్యాధారితంగా ఉందన్నారు. బహుశ ప్రభుత్వం వద్ద ఇంకో ప్యాకేజీ రెడీగా ఉండిఉండొచ్చని లేదంటే అటు వృద్ధి ఉద్దీపనతో పాటు ఇటు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్యాకేజీని ప్రకటించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ నుంచి మనకు తెలియకుండానే క్రమంగా బయటపడుతున్నామని చెప్పారు. వచ్చే రెండు మూడువారాల్లో ఎకానమీలో చురుకుదనం తెస్తే క్రమంగా అంతా సర్దుకుంటుదన్నారు. ప్రస్తుత, రాబోయే త్రైమాసికాలకు కంపెనీల ఫలితాలు, ప్రదర్శనపై పెద్దగా ఫోకస్‌ చేయాల్సిన పనిలేదని, ఆపైన మాత్రం అంతా బాగుంటుందని అంచనా వేశారు. 

మక్కువ మారుతోంది
ప్రస్తుతం ఇన్వెస్టర్ల ఫోకస్‌ ఫైనాన్షియల్స్‌ నుంచి ఫార్మా, టెలికం, డిజిటల్‌ రంగాల షేర్లవైపు మరలుతోందని దేశాయ్‌ చెప్పారు. ప్రతి బుల్‌మార్కెట్‌లో కొత్త రంగాలు ప్రకాశిస్తుంటాయని గుర్తు చేశారు. 90ల్లో ఎనర్జీ, ఆ తర్వాత కన్జూమర్‌, టెక్నాలజీ రంగాల హవా నడిచిందని, ఆపైన బీఎఫ్‌ఎస్‌ఐ రంగంపై ఫోకస్‌ పెరిగిందని చెప్పారు. గత ఫిబ్రవరిలో నిఫ్టీలో ఫైనాన్షియల్స్‌ మార్కెట్‌ క్యాప్‌ 30 శాతాన్ని చేరిందని, దీంతో ఈ రంగం టాప్‌అవుట్‌ చెందినట్లు భావించవచ్చని చెప్పారు. అందువల్ల రాబోయే బుల్‌మార్కెట్లో కన్జూమర్‌, హెల్త్‌కేర్‌, టెలికం రంగాల్లాంటి షేర్ల హవా ఉంటుందన్నారు. మార్చి 24న మార్కెట్‌ బాటమ్‌ అవుట్‌ అయినట్లు అభిప్రాయపడ్డారు. అంతమాత్రాన ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో అసలు ర్యాలీలే ఉండవని భావించకూడదని, కాకపోతే గతంలోలాగా మార్కెట్‌ను ముందుండి నడిపించలేవని మాత్రమే భావించాలని చెప్పారు. ఈ రంగంలో టాప్‌ స్టాక్స్‌ను నమ్మవచ్చన్నారు. కరోనా కారణంగా దేశీయ కస్టమర్ల వైఖరిలో మార్పురావచ్చనే ఊహలను ఆయన కొట్టిపారేశారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక టైమ్‌గ్యాప్‌తో అన్ని రంగాలు గాడిన పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదీ ఏమైనా కరోనా కారక సంక్షోభం 6-12 నెలలకు మించి ఉండకపోవచ్చని దేశాయ్‌ చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top