
బిజీ బిజీగా టిమ్ కుక్...
భారత్‌లో తొలిసారి పర్యటిస్తోన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ బుధవారం బిజీ బిజీగా గడిపారు.
భారత్ పర్యటనలో తొలిరోజు కార్పొరేట్లతో సమావేశం
ముంబై: భారత్‌లో తొలిసారి పర్యటిస్తోన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ బుధవారం బిజీ బిజీగా గడిపారు. ఈయన దిగ్గజవ్యాపారవేత్తలను, కంపెనీ హెడ్స్‌ను, బ్యాంకర్లను, బాలీవుడ్ ప్రముఖులను కలిశారు. బీజింగ్ నుంచి ప్రైవేట్ జెట్‌లో భారత్‌కు వచ్చిన కుక్.. తాజ్‌మహల్ ప్యాలెస్‌లో దిగారు. ఉదయాన్నే దక్షిణ మధ్య ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ దేవాలయ ప్రాంగంణంలోనే ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు అనంత్ అంబానీతో ముచ్చటించారు. తర్వాత ఆయన తాజ్ ప్యాలెస్‌లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీని, టీసీఎస్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.చంద్రశేఖరన్‌ని, వోడాఫోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ సూద్‌ని కలిశారు. అటుపై నలుగురు యాప్ డెవలపర్లతో మాట్లాడారు.
చందా కొచర్‌తో సమావేశం: బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్ టవర్స్‌లో ఉన్న హెడ్‌క్వార్టర్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ సహా బ్యాంక్ ఇతర ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్స్‌తో గంటకుపైగా కుక్ సమావేశమయ్యారు. యాపిల్ వాచ్‌లో బ్యాంకింగ్ యాప్‌ను ఆవిష్కరించిన తొలి సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్.
ముకేశ్ అంబానీ ఇంట్లో భోజనం
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అత్యంత విలాసవంతమైన గృహం ‘అంటిల్లా’లో కుక్ భోజనం చేశారు. తర్వాత అనంత్ అంబానీతో కొంతసేపు మాట్లాడారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ అమెరికాలో ఉన్నారు. బుధవారం రాత్రి కుక్.. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌తో కలసి డిన్నర్ చేశారు. ఇక కుక్ చివరిగా శనివారం ప్రధా ని మోదీతో భేటీ కానున్నారు. ఇందులో యాపిల్ స్టోర్ల ఏర్పాటు విషయం చర్చకు రావచ్చు.
హైదరాబాద్ కేంద్రం ఆరంభం నేడే..
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గురువారం హైదరాబాద్‌లో మ్యాపింగ్ డేటా అభివృద్ధి నిమిత్తం ఏర్పాటు చేసిన ‘డెవలప్‌మెంట్ సెంటర్’ను ఆరంభిస్తారు. గచ్చిబౌలిలోని టిస్మన్ స్పేయర్ భవనంలో దీన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం హైదరాబాద్ చేరుకునే టిమ్ కుక్... తన బృందంతో కలిసి మొదట ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకుంటారని విశ్వసనీయంగా తెలిసింది. తరవాత అక్కడి నుంచే నేరుగా మ్యాపింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు వెళతారు. ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కూడా ఈ మ్యాపింగ్ సెంటర్ ఆరంభ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియవచ్చింది. గురువారం నాడు ఒక పెద్ద వార్త వింటారంటూ మంగళవారం కేటీఆర్ ట్వీట్ చేయడం తెలిసిందే. అలాంటి ప్రకటన ఏమైనా ఉంటే డెవలప్‌మెంట్ సెంటర్ ఆరంభం సందర్భంగా ఉంటుందని సమాచారం. కాగా, ప్రారంభోత్సవం అనంతరం దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
బెంగళూరులో ‘యాప్’ డెవలప్‌మెంట్ సెంటర్
సాక్షి, బెంగళూరు: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ తన ‘ఐఓఎస్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్’ను కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సంస్థ ద్వారా భారతదేశంలోని యువ ఇంజనీరింగ్ నిపుణులకు మరింత ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు వివరించింది. ఈ సెంటర్‌లో యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం అప్లికేషన్స్(యాప్స్‌ను) తయారు చేసే డెవలపర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేక బృందం శిక్షణ ఇవ్వడంతోపాటు యువ డెవలపర్లు తయారుచేసిన అప్లికేషన్స్‌కు తన ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై స్థానాన్ని కల్పించనుంది.
ఐఓఎస్‌తో పాటు మాక్, యాపిల్ టీవీ, యాపిల్ వాచ్‌లకు సంబంధించిన అప్లికేషన్లను తయారుచేసే దిశగా యువ డెవలపర్లను తీర్చిదిద్దనుంది. ఈ సెంటర్ 2017 నాటికి అందుబాటులోకి రావచ్చని అంచనా. ఈ విషయంపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందిస్తూ..‘యాప్స్ రూపకల్పనలో ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యాలుగల యువ డెవలపర్లు భారత్‌లో ఉన్నారు. బెంగళూరు కేంద్రం ద్వారా అలాంటి ఎంతో మంది లో దాగి ఉన్న నైపుణ్యాలను మేము మరింత మెరుగుపరచనున్నాం. తద్వారా వారు ప్రపంచంలోని వినియోగదారులకు మరింత మెరుగైన, సృజనాత్మకమైన యాప్స్‌ను రూపొందించి ఇవ్వగలిగేందుకు అవకాశం ఏర్పడుతుంద’ని పేర్కొన్నారు.