పీఎన్‌బీ స్కాం : మోదీ బంధువులు బుక్కయ్యారు

ED Summons Nirav Modi Father, Sister, Brother-In-Law - Sakshi

న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణ కేసులో ఇప్పటికే సీబీఐ రెండు ఛార్జ్‌షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్కాంను దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, నీరవ్‌ మోదీ బంధువులకు సమన్లు జారీచేసింది. కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన నీరవ్‌ మోదీ తండ్రి దీపక్‌ మోదీ, సోదరి పూర్వి మెహతా, ఆమె భర్త మయాంక్‌ మెహతాలకు సమన్లు జారీచేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. పీఎన్‌బీ కుంభకోణ కేసు విచారణలో భాగంగా ఈ సమన్లను పంపినట్టు పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా వచ్చే వారం మనీ లాండరింగ్‌ నిరోధక చట్టానికి చెందిన స్పెషల్‌ కోర్టులో హాజరు కావాలని వీరికి ఆదేశాలు జారీచేసినట్టు ఈడీ ఇన్వెస్టిగేటర్లు తెలిపారు. ముంబై ఆఫీసులో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. ఈ నెల తొలి వారంలోనే నీరవ్‌ మోదీ బంధువులకు సమన్లు జారీచేశామని ఈడీ ఇన్వెస్టిగేటర్లు చెప్పారు. తమ ముందు హాజరు కావడానికి వారికి 15 రోజుల సమయమిచ్చినట్టు పేర్కొన్నారు.

నీరవ్‌ మోదీ, ఆయన గ్రూప్‌ కంపెనీలు, అంకుల్‌ మెహుల్‌ చౌక్సి, ఆయన డైమాండ్‌ కంపెనీలు కలిసి పీఎన్‌బీఐలో దాదాపు రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి. ఒకవేళ ఈ సమన్లకు నీరవ్‌ తండ్రి, సోదరి, బావ స్పందించకపోతే, మరోసారి నోటీసులు జారీచేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నీరవ్‌ తండ్రి దీపక్‌ బెల్జియంకు చెందిన వాడు కాగ, పూర్వి, ఆమె భర్త హాంకాంగ్‌లో స్థిరపడ్డారు. మెయిల్‌ ద్వారా ఈ సమన్లను అధికారులు వారికి జారీచేశారు. పూర్వి ఇప్పటికే ఈడీ కనుసన్నల్లో ఉన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా భారత్‌కు మనీ లాండరింగ్‌కు పాల్పడటానికి నీరవ్‌కు ఆమె సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆమె భర్త కూడా ఇదే కార్యకలాపాలతో నీరవ్‌కు సాయపడినట్టు తెలుస్తోంది. వీరందరూ కలిసి 2011 నుంచి 2017 మధ్యలో ముంబైలోని బ్యాంకుకు చెందిన బ్రాడీ హౌజ్‌ బ్రాంచు ఆఫీసర్లతో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడైంది. స్కాం బయటపడటానికి కొన్ని రోజుల ముందే నీరవ్‌ మోదీ, ఆయన భార్య, అంకుల్‌ మెహుల్‌ చౌక్సిలు దేశం విడిచి పారిపోయారు. జనవరి 31న ఈ కేసులో సీబీఐ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని పీఎన్‌బీ కుంభకోణం ఈడీ కూడా మనీ లాండరింగ్‌ విచారణ చేపడుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top