పీఎన్‌బీ స్కాం : నీరవ్‌ సన్నిహితుడు అరెస్ట్‌

ED arrests Nirav Modis Close Confidante Shyam Sunder Wadhwa - Sakshi

న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో మరో కీలక వ్యక్తి అరెస్ట్‌ అయ్యాడు. డైమాండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ సన్నిహితుడు, ఫైర్‌స్టార్‌ గ్రూప్‌ ఫైనాన్స్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్యామ్‌ సుందర్‌ వాద్వాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం అదుపులోకి తీసుకుంది. పీఎంఎల్‌ఏ కింద అతన్ని అరెస్ట్‌ చేసినట్టు ఈడీ చెప్పింది. గత వారమే నీరవ్‌ మోదీకి చెందిన రూ.36 కోట్లకు పైగా విలువైన వస్తువులను ఈడీ సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. సీజ్‌ చేసిన వస్తువుల్లో రూ.10 కోట్ల డైమాండ్‌ రింగ్‌, రూ.15 కోట్ల పురాతన ఆభరణాలు, రూ.1.40 కోట్ల హై-ఎండ్‌ వాచీలు, రూ.10 కోట్ల పేయింటింగ్స్‌ ఉన్నాయి.

మరోవైపు నీరవ్‌కు చెందిన ఫైర్‌స్టార్‌ డైమాండ్‌ ఇంక్‌ కంపెనీ అమెరికాలో ఫిబ్రవరి 26న దివాలా సంరక్షణ దావా వేసింది. ఈ కంపెనీ ఫైర్‌స్టార్‌ గ్రూప్‌కు సబ్సిడరీ. నీరవ్‌ మోదీ, ఆయన అంకుల్‌, గీతాంజలి జెమ్స్‌ లిమిటెడ్‌ యజమాని మెహుల్‌ చౌక్సిలు పీఎన్‌బీలో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందే జనవరిలో వీరు దేశం విడిచి పారిపోయారు. విదేశాలకు పారిపోయిన వీరిని, విచారణకు తమ ముందు హాజరుకావాలని దర్యాప్తు సంస్థలు ఆదేశించినప్పటికీ, వారు మాత్రం భారత్‌కు తిరిగి రాలేదు. పైగా తామెలాంటి తప్పును చేయలేదని లేఖలు పంపుతున్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top