ఆర్థిక వ్యవస్థ స్తంభించింది: చిదంబరం | Economy stagnant, lack of direction in government: P Chidambaram | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థ స్తంభించింది: చిదంబరం

Dec 22 2015 12:26 AM | Updated on Sep 3 2017 2:21 PM

ఆర్థిక వ్యవస్థ స్తంభించింది: చిదంబరం

ఆర్థిక వ్యవస్థ స్తంభించింది: చిదంబరం

దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం పేర్కొన్నారు.

ప్రభుత్వానికి పట్టు లేనట్లు కనిపిస్తోందని వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఒక దిశా నిర్దేశం లేకపోవడమే దీనికి కారణమని కూడా విశ్లేషించారు.  ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వానికి పట్టు లేని ధోరణి కనిపిస్తోందని  సోమవారం ఇక్కడ విలేకరులతో అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పందొమ్మిది నెలలు గడుస్తున్నా.. ఉపాధి కల్పన, ప్రైవేటు పెట్టుబడుల విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని  విమర్శించారు. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం గత వారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విశ్లేషణ చూస్తే...

పూర్తి అయోమయ ధోరణిలో ఉందని అన్నారు. ప్రభుత్వం వృద్ధికి ఊపునిచ్చే పరిస్థితులు లేవని అన్నారు. వృద్ధి రేటును 8 నుంచి 8.5 శాతం వరకూ సాధించడం సాధ్యమేనని మొదట్లో పేర్కొన్న ప్రభుత్వం ఇప్పుడు ఈ అంచనాలను 7.2 శాతం నుంచి 7.3 శాతం శ్రేణికి కుదించే ప్రయత్నం చేస్తోందన్నారు.  వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేయడం కష్టమన్న సంకేతాలు కూడా వస్తున్నాయని అన్నారు. ఆయా అంశాల నేపథ్యంలో సామాజిక రంగంపై వ్యయాల కోత జరిగే అవకాశం ఉందని అంచనావేశారు.  

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయనడం అర్ధవంతం కాదన్నారు. గడచిన పదేళ్లలో ఈ పరిమాణం శ్రేణి 35 బిలియన్ డాలర్ల నుంచి 45 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉందని పేర్కొన్న ఆయన, ఈ ఏడాది వచ్చింది 45 బిలియన్ డాలర్లేనని వివరించారు. సగటు శ్రేణికి మించి ఈ విలువ పెరగలేదన్నది గుర్తించాలని అన్నారు. వచ్చే బడ్జెట్ ప్రభుత్వానికి ఒక సవాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

పోల్

Advertisement