
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనే కాదు డిస్కౌంట్లు, ఆఫర్లు రియల్టీ రంగంలోనూ దూకుడును పెంచేశాయి. రెరా, జీఎస్‌టీ కారణాలతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలను తగ్గించిన డెవలపర్లు.. ఇన్వెంటరీని విక్రయించడం మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. దీంతో రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. నో జీఎస్‌టీ, ఉచిత రిజిస్ట్రేషన్, ఫ్రీ పార్కింగ్, హోమ్ ఫర్నీషింగ్ ఇలా రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు.
డీమోనిటైజేషన్, జీఎస్‌టీ, రెరా, ఆర్ధిక మందగమనంతో రియల్టీ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభంతో ద్రవ్య లభ్యత తగ్గింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను గట్టేక్కించేవి పండగ సీజన్లే. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు డెవలపర్లు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారని జేఎల్‌ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ ఎండీ శివ కృష్ణన్ తెలిపారు. పండుగ సీజన్స్‌లో కొత్త వాహనాలకే కాదు గృహ కొనుగోళ్లు, ప్రవేశాలకూ శుభ ముహూర్తాలే.
డిస్కౌంట్స్
గృహ కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రధాన ఆస్త్రం నగదు రాయితీ. చ.అ. లెక్కన క్యాష్ డిస్కౌంట్ చేస్తుంటారు. ఉదాహరణకు బ్రోచర్‌లో చ.అ.కు రూ.4 వేలుంటే.. క్యాష్ డిస్కౌంట్ కింద చ.అ.కు రూ.200లు తగ్గిస్తారు. అంటే 1,000 చ.అ. ఫ్లాట్‌కు క్యాష్ డిస్కౌంట్ రూ.2 లక్షలొస్తుందన్నమాట.
ఉత్పత్తులు ఆఫర్స్
ప్రతి ఫ్లాట్ బుకింగ్ మీద ఇంటికి అవసరమైన ఉత్పత్తులను ఉచితంగా అందిస్తుంటారు. ఎయిర్ కండీషర్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మాడ్యులర్ కిచెన్స్, హోమ్ ఫర్నిషింగ్, గృహోపకరణాలు లేదా టెలివిజన్, ఐఫోన్ వంటి ఉత్పత్తులు లేదా విదేశీ ట్రిప్, బంగారు నాణేలు, ఉచిత క్లబ్ మెంబర్‌షిప్స్, ఫ్రీ కార్ పార్కింగ్ వంటివి కూడా అందిస్తుంటారు. ఒకవేళ మీకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫర్నీషింగ్ వంటి ఆఫర్లు వద్దనుకుంటే వాటి బదులుగా నగదు రాయితీ ఇవ్వమని డెవలపర్లను అడొగొచ్చు. ఉదాహరణకు డెవలపర్ 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో రెండు గదులకు ఏసీలను ఆఫర్ చేస్తున్నాడనుకుందాం. వీటి బదులుగా రూ. లక్ష నగదు రాయితీ తీసుకోవచ్చు.
నో రిజిస్ట్రేషన్, జీఎస్‌టీ చార్జీలు
కొంత మంది డెవలపర్లు ఫ్లాట్ బుక్ చేస్తే జీఎస్‌టీ చార్జీలు తీసుకోమని ఆఫర్ చేస్తుంటారు. ప్రస్తుతం అఫడబుల్ హౌసింగ్‌లకు 1 శాతం, ఇతర గృహాలకు 5 శాతం జీఎస్‌టీ ఉంది. కస్టమర్ రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. ఆయా రాష్ట్రాలను బట్టి స్టాంప్ డ్యూటీ 3 నుంచి 10 శాతం, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.25 లక్షల పైన ఉండే ప్రాపర్టీలకు 1.1 శాతంగా ఉన్నాయి. కొంతమంది డెవలపర్లు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీలను కూడా ఆఫర్ చేస్తున్నారు.