35,880పైన ముగిస్తే అప్‌ట్రెండ్‌ 

Despite all the global markets losses, India is gaining momentum - Sakshi

మార్కెట్‌ పంచాంగం

అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ తీవ్రతరమై అమెరికా, చైనా, హాంకాంగ్‌లతో సహా గతవారం ప్రధాన ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలతో ముగిసినప్పటికీ,  భారత్‌ మార్కెట్‌ లాభాలు సాధించడం సానుకూలాంశం. అలాగే సెన్సెక్స్‌ బాస్కెట్‌లో ఇప్పటికే కొత్త గరిష్టస్థాయిని చేరిన బ్లూచిప్‌లు టీసీఎస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌లకు తోడుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ద్వయం క్రితంవారం ర్యాలీ సాగించడం విశేషం.  ఇందుకు మరిన్ని షేర్లు తోడైతే...ప్రపంచ ట్రెండ్‌ ఎలా వున్నా మన ప్రధాన సూచీలు కొత్త రికార్డును నెలకొల్పడం తొందర్లోనే సాధ్యపడుతుంది. అయితే నాటకీయంగా క్రూడ్‌ ధర పెరిగిన కారణంగా పైన పేర్కొన్న బ్లూచిప్‌ల్లో..విదేశీ సంస్థాగత ఇన్వస్టర్లు ఇక్కడి మార్కెట్లో భారీగా విక్రయాలు జరిపి, అమెరికాకు నిధుల్ని తరలించుకుపోయే ప్రమాదం కూడా వుంది. ఈ కారణంగా రూపాయి మరింత పతనమైతే మన మార్కెట్‌ ర్యాలీకి బ్రేక్‌పడి, కరెక్షన్‌బాటలోకి మళ్లిపోవొచ్చు. 

సెన్సెక్స్‌ సాంకేతికాలు
జూన్‌ 22తో ముగిసిన వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన 35,880–35,250 పాయింట్ల శ్రేణి మధ్యే కదిలిన సెన్సెక్స్‌ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 67 పాయింట్ల లాభంతో 35,690 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ లాభాలతో ముగియడం వరుసగా ఇది ఐదో వారం. అయితే ఈ ఐదు వారాలు కొద్దిపాటి లాభాల్ని మాత్రమే ఆర్జించడంతో పాటు గతవారంలో సెన్సెక్స్‌ హెచ్చుతగ్గుల శ్రేణి కుదించుకుపోయింది. ఈ కారణంగా సమీప భవిష్యత్తులో ఎటోవైపు వేగంగా కదిలే అవకాశం వుంది. ఈ క్రమంలో పైన ప్రస్తావించిన  శ్రేణిని ఎటువైపు ఛేదిస్తే అటువైపు వేగంగా కదలవచ్చు. ఈ వారం 35,880 పాయింట్ల వద్ద తొలి నిరోధం ఏర్పడవచ్చు. రెండు వారాల శ్రేణికి ఇది అప్పర్‌బ్యాండ్‌ అయినందున, ఈ స్థాయిపైన ముగిస్తే అప్‌ట్రెండ్‌ ఏర్పడి 35,990 పాయింట్లస్థాయిని వేగంగా అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే 36,250 పాయింట్ల వరకూ పరుగులు కొనసాగవచ్చు. అటుపైన కొద్ది రోజుల్లో కొత్త రికార్డును నెలకొల్పవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటకపోయినా, గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైనా 35,500 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభ్యమవుతున్నది. ఈ లోపున 35,330 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. ఈ లోపున ముగిస్తే 34,800 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు.  

10,895 అవరోధం నిఫ్టీకి కీలకం
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన 10,700   సమీపంలో రెండు దఫాలు మద్దతు పొంది...వారంలో చివరిరోజున 10,837 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 10,822 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ తరహాలోనే నిఫ్టీకి 10,700–10,895 పాయింట్ల శ్రేణి కీలకమైనది. ఈ శ్రేణి ఎటువైపు ఛేదిస్తే అటు వేగంగా కదలవచ్చు. ఈ వారం నిఫ్టీ పెరిగితే 10,895 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలుగుతున్నది. ఈ స్థాయిని దాటితే వెంటనే 10,930 స్థాయిని అందుకోవొచ్చు. ఈ పైన 10,980–11,000 శ్రేణి వద్దకు పెరిగే ఛాన్స్‌ వుంటుంది. ఈ స్థాయిని కూడా అధిగమించగలిగితే..కొద్దిరోజుల్లో కొత్త గరిష్టస్థాయి కష్టమేమీ కాదు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటకపోయినా, గ్యాప్‌డైన్‌తో మొదలైనా  10,750  వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 10,710 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున ముగిస్తే 10,550 వరకూ క్షీణత కొనసాగవచ్చు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top