ఆర్థిక ఫలితాలు... అంతంతే!

Companies see sequential fall in revenue margins, says ICRA report - Sakshi

ఆదాయ వృద్ధి, మార్జిన్ల పరంగా క్యూ2నే మేలు  

నిలకడగా వృద్ధి సాధిస్తున్న గ్రామీణ డిమాండ్‌: ఇక్రా

ముంబై: భారత్‌లోని కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.   మార్జిన్లు, ఆదాయ వృద్ధి విషయంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికమే మేలని  ఇక్రా తాజా నివేదిక వివరించింది. అయితే ఆదాయ వృద్ధి విషయంలో గత క్యూ3 విషయంలో ఈ క్యూ3 బావుందని పేర్కొంది. కంపెనీల క్యూ3 ఫలితాలపై ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..,  
     
►ఈ క్యూ2లో 648 లిస్టెడ్‌ కంపెనీల ఆదాయ వృద్ధి 19.4 శాతంగా ఉంది. ఇది ఈ క్యూ3లో 17.3 శాతానికి తగ్గింది. గత క్యూ3లో ఇది 9.8 శాతంగానే ఉంది.  
►ఈ క్యూ2లో నిర్వహణ మార్జిన్లు 16.6 శాతంగా ఉండగా, ఈ క్యూ3లో 16.4 శాతానికి తగ్గింది. గత క్యూ3లో 17.1 శాతంగా ఉంది.  
►రూపాయి పతనం ప్రతికూల ప్రభావం, ఇంధన, ముడి పదార్ధాల ధరలు పెరగడం వల్ల మార్జిన్లు తగ్గాయి.  
►ఇంధన ధరలు పెరగడం వల్ల విమానయాన, సిమెంట్, బిల్డింగ్‌ మెటీరియల్స్‌ కంపెనీల మార్జిన్లు తగ్గాయి.  
►ముడి పదార్ధాల ధరలు పెరగడం వల్ల వాహన, కన్సూమర్‌ డ్యూరబుల్స్, పెయింట్స్, మీడియా కంపెనీల మార్జిన్లు పడిపోయాయి.  
►వినియోగ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వాహన విక్రయాలు తగ్గగా, కన్సూమర్‌ డ్యూరబుల్స్, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సూమర్‌ గూడ్స్‌ కంపెనీల అమ్మకాలు ఆరోగ్యకరంగా ఉన్నాయి.  
►గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ నిలకడగా కొనసాగనున్నది. పట్టణ వృద్ధి కంటే కూడా గ్రామీణ వృద్ధిదే పైచేయి కానున్నది.  
►కనీస మద్దతు ధర పెంపు, ఎన్నికల నేపథ్యంలో తాయిలాల కారణంగా గ్రామీణ వృద్ధి జోరు కొనసాగగలదు.  
► ఐటీ రంగానికి కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సేవల విభాగం జోరు, డిజిటల్‌ రంగంలో వృద్ధి కారణంగా ఐటీ కంపెనీల ఆదాయం 8.3 శాతం (డాలర్లపరంగా) పెరిగింది. అయితే రూపాయి పతనమైనప్పటికీ ఐటీ కంపెనీల మార్జిన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఐటీ కంపెనీలు డిజిటల్‌ విభాగంపై అధికంగా పెట్టుబడులు పెడుతుండటమే దీనికి కారణం.  
►నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడం, కొత్త ఆర్డర్ల జోరు కారణంగా స్టీల్, సిమెంట్‌ వినియోగం పెరిగింది. స్టీల్‌ కంపెనీలు 8 శాతం, సిమెంట్‌ కంపెనీలు 13 శాతం చొప్పున ఆదాయాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top