ఆర్‌బీఐ పాలసీ సమీక్ష ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ పాలసీ సమీక్ష ప్రారంభం

Published Wed, Feb 8 2017 12:44 AM

ఆర్‌బీఐ పాలసీ సమీక్ష ప్రారంభం

నేడు విధాన ప్రకటన
న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. బుధవారం విధాన ప్రకటన వెలువడనుంది. పావుశాతం రెపో కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 6.25%)పై మిశ్రమ అంచనాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆర్‌బీఐ గవర్నర్‌ తనంతట తానుగా కాకుండా మెజారిటీ ప్రాతిపదికన రేట్ల నిర్ణయం తీసుకోడానికి  ఆరుగురు సభ్యులతో పరపతి విధాన కమిటీ ఏర్పడిన తరువాత జరుగుతున్న 3వ సమావేశం ఇది. ఎంసీపీకి ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వం వహిస్తున్నారు. రెపో విషయంలో కమిటీ రెండుగా చీలిపోతే, ఆయన నిర్ణయం కీలకం అవుతుంది.

బీఓఎఫ్‌ఏ అంచనా పావుశాతం కోత...
కాగా, పెద్ద నోట్ల రద్దు వల్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై పడిన ప్రభావాన్ని నిరోధించడానికి ఆర్‌బీఐ పావుశాతం రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం– బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ మంగళవారం పేర్కొంది. నోట్ల రద్దు వల్ల జీడీపీపై పావు శాతం నుంచి అరశాతం వరకూ ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని స్వయంగా ఆర్థిక సర్వే అంచనావేస్తున్న సంగతి తెలిసింది.

Advertisement
Advertisement