రెండో ఎన్‌పీఎస్‌ ఖాతాకు వీలుంటుందా?

Can a second NPS account be accountable? - Sakshi

పన్ను ఆదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో లాక్‌–ఇన్‌ పీరియడ్‌ వరకే ఇన్వెస్ట్‌ చేయడం మంచిదా ?     – వైష్ణవి, హైదరాబాద్‌
పన్ను ఆదా మ్యూచువల్‌ ఫండ్స్‌ను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. పనితీరు దూకుడుగా ఉండేవి. పనితీరు సామాన్యంగా ఉండేవి. ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌ అన్నీ పూర్తిగా ఈక్విటీలోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. వీటిల్లో లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో అధికంగా ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ ఉన్నాయి. కొన్ని ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విషయంలో ప్రయోగాలు చేస్తాయి. ఈ తరహా ఫండ్స్‌ చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసి గరిష్ట లాభాలను సాధించాలని ప్రయత్నాలు చేస్తాయి.

ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మూడేళ్ల వరకూ లాక్‌–ఇన్‌ అవుతాయి కాబట్టి, దూకుడుగా ఉండే ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. మూడేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ గురించి ఆలోచించకండి. కనీసం ఐదు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్‌ చేయడమే సబబు. ఇక సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)ల ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు.  

నేను కొన్ని ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను.  ఈ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌లోకి (వీటి లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత)బదిలీ చేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా?     – రాజా, విశాఖపట్టణం  
ఈఎల్‌ఎస్‌ఎస్‌ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌లోకి మార్చడం సరైన నిర్ణయం కాదు. మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఈఎల్‌ఎస్‌ఎస్‌ మంచి పనితీరు చూపించకపోతేనే లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత  ఈ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. లేదా మీకు డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే అదీనూ బయట ఎక్కడైనా అప్పు పుట్టని పరిస్థితుల్లో మాత్రమే ఈ ఫండ్స్‌ నుంచి వైదొలగవచ్చు. అలా కాని పక్షంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ల నుంచి వేరే ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయడం పెట్టుబడుల వ్యూహం పరంగా సరైన నిర్ణయం కాదు.  

నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌(ఎన్‌పీఎస్‌) ఖాతా మాకు తప్పనిసరి. నా వేతనంతో అనుసంధానమై ఉన్న ఎన్‌పీఎస్‌ ఖాతాను ప్రారంభించాను. అయితే ఈ ఖాతాలో ఈక్విటీ కేటాయింపులు పెంచుకోవడానికి లేదు. అందుకని నేను మరో ఎన్‌పీఎస్‌ ఖాతాను ప్రారంభించవచ్చా?     – దత్తాత్రేయ, విజయవాడ
మీరు ఒకటికి మించి నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌(ఎన్‌పీఎస్‌) ఖాతాలు తెరవడానికి వీలు లేదు. ఈక్విటీలో 50 శాతానికి మించి ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఎన్‌పీఎస్‌లో లేదు. ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెంచుకోవాలనుకుంటే, మీరు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్‌ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందాలంటే, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

సెక్షన్‌ 80 సీ కింద మీరు రూ.1.5 లక్ష వరకూ ఆదాయపు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇప్పటికే సెక్షన్‌ 80సీ పరిమితి పూర్తయితే, ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్‌ స్కీమ్స్‌లో గానీ, డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో గానీ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయడమే ఉత్తమమైన విధానం.  

నేను నెలకు రూ. లక్ష వరకూ ఇన్వెస్ట్‌ చేయగలను. కనీసం 15–20 ఏళ్ల వరకూ ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మిడ్‌ క్యాప్, స్మాల్‌–క్యాప్‌ ఫండ్స్‌నే ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఎంచుకోవాలనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి.      – రంజిత్, నిజామాబాద్‌
నెలకు రూ. లక్ష చొప్పున కనీసం 15–20 ఏళ్ల పాటు మిడ్‌–క్యాప్, స్మాల్‌–క్యాప్‌ ఫండ్స్‌లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్‌ చేయవచ్చు.  మార్కెట్‌ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నా కూడా చాలా మిడ్‌–క్యాప్, స్మాల్‌–క్యాప్‌ ఫండ్స్‌ మంచి పనితీరు చూపించాయి. మిడ్‌–క్యాప్, స్మాల్‌–క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండవచ్చు. మీరు 15–20 ఏళ్లు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి,  మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

అయితే ఇలా మిడ్‌–క్యాప్, స్మాల్‌–క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నప్పుడు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఆయా ఫండ్స్‌ పనితీరును కనీసం రెండేళ్లకొకసారైనా సమీక్షించాలి. ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో మార్పు చేర్పులు జరుగుతుంటాయి. మీ పోర్ట్‌ఫోలియోలోని ఏ ఫండ్‌ పనితీరు, అదే కేటగిరీలోని మరే ఇతర ఫండ్‌ పనితీరు కన్నా అధ్వానంగా ఉంటే.. ఆ ఫండ్‌ నుంచి మరో ఫండ్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను  మార్చండి.

ఏదైనా ఒక ఫండ్‌ను నిర్వహించే ఫండ్‌ మేనేజర్‌ మారిపోయినా, లేదా మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్‌ నిర్వహణ ఆస్తులు భారీగా పెరిగినా..ఫండ్‌ పనితీరు ప్రభావితం అవుతుంది. ఇలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటే, మిడ్‌–క్యాప్, స్మాల్‌–క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఎంపిక చేసిన ఫండ్స్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించండి. మార్కెట్‌ పెరుగుదల, క్షీణతలతో సంబంధం లేకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. కనీసం రెండేళ్లకొకసారైనా మీ పోర్ట్‌ఫోలియోను మాత్రం సమీక్షించడం మరచిపోకండి.

- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top