కోలా, పెప్సీలకు క్యాంపాకోలా పోటీ! | Cam cola focus on expansion across the country | Sakshi
Sakshi News home page

కోలా, పెప్సీలకు క్యాంపాకోలా పోటీ!

May 23 2019 12:20 AM | Updated on May 23 2019 12:20 AM

Cam cola focus on expansion across the country  - Sakshi

న్యూఢిల్లీ: దేశీ శీతల పానీయాల మార్కెట్లో స్థానిక బ్రాండ్‌ క్యాంపాకోలా దిగ్గజాలకు దీటుగా విస్తరించే ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ప్యూర్‌ డ్రింక్స్‌ గ్రూపు 1970ల్లో క్యాంపాకోలా బ్రాండ్‌ను దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మన దేశంలో 1949లో కోకకోలాను పరిచయం చేసింది ఇదే గ్రూప్‌ కావడం గమనార్హం. 1970ల వరకు కోకకోలాకు తయారీ, డిస్ట్రిబ్యూటర్‌గా పీర్స్‌గ్రూపు పనిచేయగా, కోకకోలా భారత మార్కెట్‌ నుంచి వెళ్లిపోయిన తర్వాత తన బ్రాండ్లతో దేశీయంగా చొచ్చుకుపోయింది. విదేశీ కంపెనీల పోటీ లేని దశలో మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరింది. ‘ద గ్రేట్‌ ఇండియన్‌ టేస్ట్‌’ నినాదంతో క్యాంపాకోలా స్థానిక రుచులతో కూడిన డ్రింక్స్‌ను పరిచయం చేసింది. అయితే, ఆ తర్వాత కోకకోలా తిరిగి భారత్‌లోకి రావడం, పెప్సీకో కూడా ప్రవేశంతో క్యాంపాకోలా వెనుకబడిపోవడం గమనార్హం. ఇప్పుడు పీర్స్‌ గ్రూపు వ్యవస్థాపకులైన సర్దార్‌ మోహన్‌సింగ్‌ కుటుంబంలో నాలుగో తరానికి చెందిన జయవంత్‌జిత్‌ సింగ్‌ దేశీ బ్రాండ్‌కు ఆదరణ తీసుకురావడంతోపాటు దేశవ్యాప్త విస్తరణపై దృష్టి పెట్టారు.  

త్వరలో చెన్నైకు... 
పీర్స్‌ గ్రూపు కార్యకలాపాలను ప్రస్తుతం జయవంత్‌జిత్‌ సింగ్‌ పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కశ్మీర్, యూపీ, హరియాణా, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు, రాజస్తాన్, ఢిల్లీ, ఉత్తరాంచల్, హిమాచల్‌ప్రదేశ్, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో క్యాంపాకోలా బ్రాండ్లు స్థానికులకు పరిచయమే. ప్రధానంగా, ఉత్తరాది, ఈశాన్య మార్కెట్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చేరువయ్యేందుకు గాను తమకు ఫ్రాంచైజీ ప్లాంట్లు ఉన్నాయని జయవంత్‌జిత్‌ సింగ్‌ తెలిపారు. సిల్వాస్సాలో నిమిషానికి 600 బాటిళ్ల సామర్థ్యంతో యూనిట్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నేపాల్‌లోనూ తమ కార్యకలాపాలు ఉన్నాయని తెలిపారు. చెన్నై వంటి దక్షిణాది మార్కెట్లలోకి విస్తరించాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. రోజూ 4 మిలియన్ల కేసులను ప్రస్తుతం తయారు చేస్తున్నట్టు చెప్పారు. కోకకోలా భారత్‌ నుంచి తప్పుకున్న తర్వాత 1970ల చివర్లో, 1980ల్లో పార్లే గ్రూపు సైతం దేశీయ మార్కెట్‌లో హవా చలాయించింది. థమ్స్‌అప్, గోల్డ్‌స్పాట్, లిమ్కా బ్రాండ్లు పార్లేవే. కాకపోతే ఆ తర్వాత వీటిని మళ్లీ 1993లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన కోకకోలాకు విక్రయించడం జరిగింది. పెప్సీకో కూడా ప్రవేశించడంతో స్థానిక బ్రాండ్లు చిన్నబోయాయి. దీంతో దేశీయ శీతల పానీయాల మార్కెట్‌ను రెండు విదేశీ సంస్థలే ప్రస్తుతం శాసిస్తున్నాయి.  

నెగ్గుకొస్తుందా...? 
శామ్‌సికా మార్కెటింగ్‌ కన్సల్టెంట్స్‌ సీఎండీ జగ్‌దీప్‌కపూర్‌ మాట్లాడుతూ... ‘‘ఉత్తరాదిన క్యాంపాకోలాకు బలమైన బ్రాండ్‌ ఈక్విటీ ఉంది. అయితే, బ్రాండ్‌ స్థాయి అతిపెద్ద సవాలు కాగలదు’’ అని పేర్కొన్నారు. థమ్స్‌అప్, కోకకోలా, పెప్సీ మార్కెట్లో పెద్ద ఎత్తున వాటా ఉన్న బ్రాండ్లు. మరి క్యాంపాకోలా కూడా ఈ స్థాయికి ఎదగాలంటే అంతే దీటుగా బ్రాండ్‌ కూడా ఉండాలంటున్నారు మార్కెట్‌ నిపుణులు. పాతతరంతోపాటు, కొత్త తరానికీ మధ్య సమతూకం అవసరమన్నారు కపూర్‌. ఉత్తరాదిన రిలయన్స్‌ ఫ్రెష్, డీమార్ట్‌ తదితర స్టోర్లలోనూ క్యాంపాకోలా అడుగుపెట్టింది. ఆరెంజ్, లెమన్, లైమ్‌ అండ్‌ లెమన్, జీరసోడా, ఫిజ్జి యాపిల్‌ తదితర రుచులతో కూడిన డ్రింక్స్‌ను ప్రస్తుతం క్యాంపాకోలా మార్కెట్‌ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement