ఓఎన్‌జీసీ చేతికి హెచ్‌పీసీఎల్‌

ఓఎన్‌జీసీ చేతికి హెచ్‌పీసీఎల్‌


ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

రూ.30,000 కోట్లు కేంద్ర ఖజానాకు

దేశంలో భారీ చమురు కంపెనీ అవతరణ

నేడు పార్లమెంటులో మంత్రి ప్రకటన  
న్యూఢిల్లీ: దేశంలో భారీ చమురు కంపెనీ ఏర్పాటు దిశగా బుధవారం తొలి అడుగు పడింది. హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో (హెచ్‌పీసీఎల్‌) కేంద్ర ప్రభుత్వానికి 51.11 శాతం వాటా ఉండగా... ఆ వాటాను ఓఎన్‌జీసీకి విక్రయించే ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.26,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల మేర నిధులు సమకూరనున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణతో ఈ ఏడాది రూ.72,500 కోట్లను సమీకరించాలన్న కేంద్ర సర్కారు లక్ష్యంలో సగం ఈ డీల్‌ ద్వారా రానున్నాయి.పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్‌ నిర్ణయాలను బయటకు వెల్లడించలేదు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ గురువారం పార్లమెంటులో దీనిపై ఓ ప్రకటన చేస్తారు. ఇతర విలీనాలపై కూడా ఆయన స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. చమురు ఉత్పత్తి నుంచి విక్రయం వరకూ అన్ని కార్యకలాపాలూ నిర్వహించే ఓ అతిపెద్ద కంపెనీని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఈ ఏడాది బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా జైట్లీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.అందుకు సంబంధించిన తొలి అడుగు ఇప్పుడు పడింది. ఈ డీల్‌ తర్వాత కూడా హెచ్‌పీసీఎల్‌ లిస్టెడ్‌ కంపెనీగా ప్రస్తుత తీరులోనే కొనసాగుతుంది. ఓఎన్‌జీసీతో కలిసి ఒకే లిస్టెడ్‌ కంపెనీగా కొనసాగే అవకాశం ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా డీల్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హెచ్‌పీసీఎల్‌ బుధవారం నాటి క్లోజింగ్‌ ధర రూ.384 ప్రకారం ప్రభుత్వానికి రూ.30,000 కోట్లు లభించే అవకాశం ఉండగా, ఏడాది, 26 వారాలు, 60 రోజుల సగటు ధర ఆధారంగా విక్రయ ధర ఉంటుందని ఆ అధికారి తెలిపారు.హెచ్‌పీసీఎల్‌లో ఎంఆర్‌పీఎల్‌ విలీనం!

ఈ డీల్‌ కంటే ముందే ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థగా ఉన్న మంగళూరు రిఫైనరీస్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ను (ఎంఆర్‌పీఎల్‌) హెచ్‌పీసీఎల్‌ విలీనం చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఓఎన్‌జీసీ పరిధిలోని రిఫైనరీ వ్యాపారం అంతా హెచ్‌పీసీఎల్‌ నిర్వహణ కిందకు వస్తుంది. ఎంఆర్‌పీఎల్‌లో ఓన్‌జీసీకి 71.63 శాతం వాటా ఉండగా, హెచ్‌పీసీఎల్‌కు 16.96 శాతం వాటా ఉంది. ఎంఆర్‌పీఎల్‌ను తనలో విలీనం చేసుకుంటున్నందున ఓఎన్‌జీసీకి ఉన్న 71.63 శాతం వాటాకు గాను హెచ్‌పీసీఎల్‌ సుమారు రూ.16,414 కోట్లను చెల్లించాల్సి రావచ్చు. ఇది కాకుండా ఓఎన్‌జీసీకి ప్రస్తుతం రూ.13,014 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఐవోసీఎల్‌లో 13.77 శాతం వాటా ఉండగా, దాన్ని విక్రయించడం ద్వారా రూ.25,000 కోట్లను సమకూర్చుకునే అవకాశం ఉంది. ఈ రూపేణా హెచ్‌పీసీఎల్‌ వాటా కొనుగోలుకు అవసరమైన నిధుల సమీకరణకు ఓఎన్‌జీసీకి అవకాశాలున్నాయి. ఇవేవీ కార్యరూపం దాల్చకుంటే రూ.10,000 కోట్ల మేర రుణాలను సమీకరించాల్సి రావచ్చు. ఓఎన్‌జీసీ చమురు ఉత్పత్తి కంపెనీ కాగా, హెచ్‌పీసీఎల్‌ చమురు రిఫైనరీ, రిటైల్‌ విక్రయాల సంస్థ.తదుపరి మరో విలీనం

అంతర్జాతీయంగా చమురు దిగ్గజ కంపెనీలకు పోటీనిచ్చే స్థాయిలో కనీసం ఓ కంపెనీ అయినా ఉండాలన్న ప్రభుత్వ యత్నాలకు తాజా డీల్‌ కీలకం కానుంది. ఈ మార్గంలో తదుపరి ఆయిల్‌ ఇండియాను విలీనం చేసుకోవాలని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌)ను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఆయిల్‌ ఇండియా ప్రమోటర్‌ కేంద్రమే. ఇందులో ప్రభుత్వానికి 66.13% వాటా ఉంది. అలాగే, గెయిల్‌లో బీపీసీఎల్‌ను విలీనం చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలను విలీనం చేస్తే ఉపయోగమేంటన్న సందేహాలు రావచ్చు. దీనివల్ల వాటి సమర్థత మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఒకే కంపెనీ చేతిలో అధిక సామర్థ్యం ఉండడంతో సవాళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతర్జాతీయంగా ఆయిల్‌ మార్కెట్లలోని అస్థిరతలను తట్టుకోగలదు.ఈటీఎఫ్‌లపై ప్రత్యామ్నాయ యంత్రాంగం

న్యూఢిల్లీ: ఎక్సే్ఛంజీ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌) మార్గంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) వాటాల్ని విక్రయించే విషయమై నిర్ణయానికి ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అరుణ్‌జైట్లీ సారథ్యంలోని మంత్రుల బృందం నాయకత్వం వహిస్తుంది. దీన్లో రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీతో పాటు సంబంధిత శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఏయే లిస్టెడ్‌ ఆర్థిక సంస్థల షేర్లను ఈటీఎఫ్‌లో చేర్చాలి వంటి అంశాలను ప్రత్యామ్నాయ యంత్రాంగం ఖరారు చేస్తుంది. మరోవైపు, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో 51.11 శాతం ప్రభుత్వ వాటాలను ఓఎన్‌జీసీకి విక్రయించే ప్రతిపాదనకు కూడా సీసీఈఏ ఆమోదముద్ర వేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top