బ్యాంకుల సమ్మె వాయిదా | Bank unions defer proposed 4-day strike | Sakshi
Sakshi News home page

బ్యాంకుల సమ్మె వాయిదా

Jan 20 2015 2:11 AM | Updated on Sep 2 2017 7:55 PM

బ్యాంకుల సమ్మె వాయిదా

బ్యాంకుల సమ్మె వాయిదా

బుధవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది.

* ఫిబ్రవరి మొదటి వారంలో చర్చలు
* తేలకుంటే నెలాఖరులో మళ్లీ సమ్మె
* ఉద్యోగ సంఘాల ప్రకటన

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుధవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది.

వేతనాల పెంపుపై ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరుపుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో జనవరి 21 నుంచి తలపెట్టిన సమ్మెను ఫిబ్రవరి మాసాంతానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రతినిధులు తెలిపారు. సమ్మె చేయాలా వద్దా అన్న విషయంలో యూనియన్ల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చినప్పటికీ అంతిమంగా వాయిదా వేయడానికే మొగ్గు చూపినట్లు తెలిసింది.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా సమ్మె చేయడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచవచ్చని రెండు మూడు యూనియన్లు వాదించాయి. అయితే, చర్చలు జరుగుతున్న సమయంలో సమ్మె చేయడం సరికాదని మరికొన్ని యూనియన్లు వాదించాయి. చివరకు తొమ్మిది ప్రధాన యూనియన్లతో ఏర్పడిన యూఎఫ్‌బీయూ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది.
 
ప్రస్తుతం ఐబీఏతో జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే సమావేశంలో సమస్యను పరిష్కరిస్తామని ఐబీఏ హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు యూనియన్ నేతలు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ 2012 ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత చర్చల్లో యూనియన్లు 23 శాతం పెంపు డిమాండ్ నుంచి 19.5 శాతానికి దిగిరాగా, ఐబీఏ 11 నుంచి 12.5 శాతానికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement