‘అప్పు’డే వద్దు!

Bank credit growth slips to single-digit for first time - Sakshi

రుణాలు తీసుకోవడానికి వెనుకంజ...

సెప్టెంబర్‌లో రుణ వృద్ధి 8.79 శాతమే...

సింగిల్‌ డిజిట్‌లోకి రావడం ఈ ఏడాది ఇదే తొలిసారి

ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్‌ బలహీనంగా ఉందనడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనానికి బలమైన నిదర్శనంగా బ్యాంకింగ్‌ రుణ వృద్ధి ఘోరంగా పడిపోతోంది. సెప్టెంబర్‌ 27తో ముగిసిన పక్షానికి(15 రోజుల వ్యవధి) రుణ వృద్ధి రేటు సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైంది. వృద్ధి ఈ స్థాయికి పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

  ► 2019 సెప్టెంబర్‌ 27తో ముగిసిన పక్షానికి (అప్పటికి వార్షిక ప్రాతిపదికన చూస్తే) బ్యాంకింగ్‌ రుణాలు 97.71 లక్షల కోట్లు.
  ► 2018 ఇదే కాలానికి రుణాల పరిమాణం రూ.89.82 లక్షల కోట్లు.  
  ► అంటే వృద్ధి రేటు 8.79 శాతమన్నమాట.  
  ► వృద్ధి రేటు సింగిల్‌ డిజిట్‌కు పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి.  
  ► 2019 సెప్టెంబర్‌ 13 ముగిసిన పక్షం రోజులకు చూస్తే, రుణాల పరిమాణం రూ.97.01 లక్షల కోట్లుగా ఉంది. 2018 ఇదే కాలంలో పోల్చితే వృద్ధి రేటు 10.26 శాతంగా ఉంది.  

డిపాజిట్లూ మందగమనమే...
ఇక బ్యాంకుల్లో డిపాజిట్ల విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా వృద్ధిరేటు మందగమనంలోకి జారిపోయింది. 2019 సెప్టెంబర్‌ 27తో ముగిసిన పక్షం రోజులకు డిపాజిట్లు రూ. 129.06 లక్షల కోట్లు. 2018 ఇదే కాలానికి ఈ మొత్తం రూ.118 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 9.38 శాతంగా ఉంది. 2019 సెప్టెంబర్‌ 13తో ముగిసిన పక్షం రోజులకు చూస్తే, వృద్ధి రేటు 10.02 శాతంగా ఉంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top