2020 నాటికి... 60 లక్షల కోట్లకు జీవిత బీమా మార్కెట్ | AUM of life insurers may treble to USD 1 trillion by 2020' | Sakshi
Sakshi News home page

2020 నాటికి... 60 లక్షల కోట్లకు జీవిత బీమా మార్కెట్

Feb 21 2014 1:29 AM | Updated on Sep 2 2017 3:55 AM

2020 నాటికి జీవిత బీమా సంస్థల నిర్వహణలో ఉండే ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 60 లక్షల కోట్లకు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్న నేపథ్యంలో  2020 నాటికి జీవిత బీమా సంస్థల నిర్వహణలో ఉండే ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 60 లక్షల కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (ఎల్‌ఐసీ) సెక్రటరీ జనరల్ సీఏ.వి. మాణిక్యం తెలిపారు. అప్పటికి బీమా తీసుకోతగిన వారి సంఖ్య 75 కోట్లకు, సగటు జీవన కాలం 74 ఏళ్లకు పెరగగలదని వివరించారు. ప్రస్తుతం జీవిత బీమా రంగం రూ. 20 లక్షల కోట్లుగా ఉండగా.. 32 కోట్ల పైచిలుకు పాలసీ దారులు ఉన్నట్లు మాణిక్యం చెప్పారు. బీమా ఆవశ్యకత గురించి అవగాహన పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలవారికీ జీవిత బీమా పాలసీలు అందించే దిశగా వివిధ మార్గాలపై దృష్టి సారిస్తున్నామన్నారు.  2020 నాటికి ఇన్‌ఫ్రా రంగంలోకి జీవిత బీమా రంగం పెట్టుబడులు రూ. 1.73 లక్షల కోట్ల నుంచి రూ. 3.5 లక్షల కోట్లకు పెరగగలవని తెలిపారు. అలాగే ఈ రంగంలో ప్రస్తుతం 2.41 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య అయిదు లక్షలకు పెరుగుతుందని మాణిక్యం చెప్పారు.
 
  మరోవైపు, జీవిత బీమా వ్యాపారం భారీగా పెరగడానికి అపార అవకాశాలు ఉన్నాయని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అవేర్‌నెస్ కమిటీ చైర్మన్ రాజేశ్ సూద్ చెప్పారు. కొత్త ప్రీమియం చెల్లింపులు  ఒక మోస్తరుగానే ఉన్నా .. రెన్యువల్ ప్రీమియాల ఆదాయం గణనీయంగానే పెరుగుతోందని ఆయన వివరించారు. ఈ ఏడాది జనవరిలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి సుమారు 367 కొత్త పథకాలను జీవిత బీమా సంస్థలు అందుబాటులోకి తెచ్చాయని తెలిపారు. అటు క్లెయిముల విషయంలో జీవిత బీమా సంస్థలు కొర్రీలు పెడుతుంటాయన్న ఆరోపణలు సరికాదని సూద్ చెప్పారు. సెటిల్‌మెంట్ రేటు 97 శాతం స్థాయిలో ఉంటోందని ఆయన చెప్పారు. సగటున ప్రతి గంటకు 50 క్లెయిముల మేర, ఏటా దాదాపు 5 లక్షల క్లెయిములను పరిష్కరిస్తున్నామని సూద్ వివరించారు.  గత ఆర్థిక సంవత్సరం 3.42 లక్షల ఫిర్యాదులు రాగా 99.64 శాతం పరిష్కరించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement