పదికి ఏడు మార్కులు..! | Assocham gives 70% marks to Modi govt | Sakshi
Sakshi News home page

పదికి ఏడు మార్కులు..!

May 18 2015 1:45 AM | Updated on Aug 21 2018 9:38 PM

పదికి ఏడు మార్కులు..! - Sakshi

పదికి ఏడు మార్కులు..!

మోదీ ప్రభుత్వం తొలి ఏడాది పనితీరుపై పారిశ్రామిక మండళ్లు సానుకూలంగానే స్పందించాయి.

మోదీ సర్కారు ఏడాది పాలనపై అసోచామ్
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం తొలి ఏడాది పనితీరుపై పారిశ్రామిక మండళ్లు సానుకూలంగానే స్పందించాయి. పదికి ఏడు మార్కులు ఇస్తున్నట్లు అసోచామ్ పేర్కొంది. అయితే, పన్ను సంబంధ అంశాలు, వ్యాపారాలకు మెరుగైన పరిస్థితులను కల్పించడం వంటి విషయాల్లో ప్రభుత్వం ఇంకా చాలాచేయాల్సి ఉందని అభిప్రాయపడింది. ‘గడిచిన ఏడాది వ్యవధిలో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చింది.

కరెన్సీ స్థిరత్వం, ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకోవడం వంటివి దీనికి దోహదం చేశాయి. రెట్రోస్పెక్టివ్ పన్ను(పాత లావాదేవీలపై పన్ను విధింపు)లకు సంబంధించి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) ఆందోళనలను పరిష్కరించాలి. భారీ స్థాయి మౌలిక రంగ ప్రాజెక్టులు ప్రారంభం కావాల్సి ఉంది’ అని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఐదు విదేశీ పర్యటనలతో ఆర్థికపరమైన దౌత్యంలో కొత్త మార్పులను తీసుకొచ్చేలా చేసిందని కూడా ఆయన పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీలు, స్వచ్ఛ భారత్, జన ధన యోజన వంటి పథకాలపై విదేశాల్లో కూడా విశేష స్పందన వ్యక్తమైందని కపూర్ చెప్పారు.
 
చైనాతో ఆర్థిక బంధం బలపడింది: సీఐఐ
ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనతో ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధానికి పునరుత్తేజం లభించిందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. పర్యటన సందర్భంగా కుదిరిన వ్యాపార ఒప్పందాలు శుభపరిణామమని అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement