అస్థిరతల మధ్య మెరుగైన ఎంపిక!

Asset Hybrid Equity Scheme - Sakshi

మిరే అస్సెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్టాల్లో ఉండడంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఇతర అంశాలు ప్రభావం చూపిస్తున్న వేళ, ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా కాస్తంత రిస్క్‌ తగ్గించుకుని, మెరుగైన రాబడులు అందుకోవాలనుకునే వారికి మిరే అస్సెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకం అనకూలంగా ఉంటుంది. హైబ్రిడ్‌ పథకంగా మొత్తం పెట్టుబడుల్లో 65–80 శాతం మేర ఈక్విటీల్లో, మిగిలినది డెట్, మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీనివల్ల రిస్క్‌ మోస్తరుగానే ఉంటుంది.

ఇది కొత్త పథకం. ప్రారంభించి మూడేళ్లే అయింది. ఈ కాలంలో పనితీరు ఫర్వాలేదు. ఏడాది కాలంలో 9.63 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్లలో చూసుకుంటే ఏటా సగటున రాబడులు 15 శాతంపైన ఉన్నాయి. ఇదే కాలంలో ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే క్రిసిల్‌ హైబ్రిడ్, ప్లస్‌ 65 అగ్రెస్సివ్‌ రాబడులు 9.9 శాతం, 10.7 శాతంగానే ఉన్నాయి. ఈక్విటీల్లో ఎక్కువ భాగం పెట్టుబడులు పెట్టే పథకం కావడంతో దీర్ఘకాల రాబడులను పరిగణనలోకి తీసుకోవడమే సరైనది.

సెబీ కేటగిరీల్లో మార్పులకు ముందు మిరే అస్సెట్‌ ప్రుడెన్స్‌ ఫండ్‌ పేరుతో కొనసాగింది. ఈ పథకం 2015లో ఆరంభమైన తర్వాత, మార్కెట్లలో భారీ పతనాలు చోటు చేసుకోలేదు. కనుక 2007 తరహా సంక్షోభాలు ఎదురైతే పనితీరు ఎలా ఉంటుందో చూడాలి. 2016, 2017 ఈ రెండు సంవత్సరాల్లోనూ ఈ పథకం కేటగిరీ సగటు రాబడుల కంటే ఎక్కువే ఇన్వెస్టర్లకు పంచింది. 2016లో 8.5 శాతం, 2017లో 27.8 శాతం రాబడులు ఈ పథకంలో ఉన్నాయి.

పోర్ట్‌ఫోలియో
ఈక్విటీల్లో ఈ పథకం 60 స్టాక్స్‌ను కలిగి ఉంది. 26 రంగాలకు చెందిన కంపెనీలతో డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తోంది. స్టాక్స్‌ ఎంపికకు బోటమ్‌అప్‌ విధానాన్ని అనుసరిస్తుంది. బ్యాంకింగ్‌ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంది. 20 శాతం నిధులను బ్యాంకింగ్‌ రంగంలోనే ఇన్వెస్ట్‌ చేయడం దీన్నే సూచిస్తోంది. 2016 ప్రారంభం నుంచి ఇదే స్థాయిలో పెట్టుబడులను కేటాయించింది. సాఫ్ట్‌వేర్, కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ రంగాలకు తదుపరి ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది కాలంలో ఫైనాన్స్, పెట్రోలియం ఉత్పత్తుల రంగాలకు పెట్టుబడులను పెంచడాన్ని గమనించొచ్చు.

ఇక డెట్‌ విభాగంలో ఎక్కువ భాగం పెట్టుబడులను ప్రభుత్వ సెక్యూరిటీలు, కమర్షియల్‌ పేపర్లకు కేటాయించింది. తాజా పోర్ట్‌ఫోలియోను గమనిస్తే ఈక్విటీల్లో పెట్టుబడులు 74.68 శాతం, డెట్‌లో 23.19 శాతం చొప్పున ఉంటే, 2.09 నగదు నిల్వలను కలిగి ఉంది. సెబీ కేటగిరీ మార్పుల నేపథ్యంలో ఈ పథకం అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ కేటగిరీలోకి వస్తుంది. నిబంధనల మేరకు 65–80 శాతం వరకు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంటుంది. 20–35 శాతం మేర ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే, ఈ ఫండ్‌ మేనేజర్లు ఈక్విటీ పెట్టబడులను 70–75 శాతం మధ్య కొనసాగిస్తూ వస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top