ఏషియన్‌ పెయింట్స్‌- బీవోబీ.. భేష్

Asian Paints -Bank of Baroda gains on Q4 results - Sakshi

క్యూ4 ఫలితాల ఎఫెక్ట్‌

5 శాతం ఎగసిన షేర్లు


గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో ఓవైపు ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఏషియన్‌ పెయింట్స్‌, మరోపక్క పీఎస్‌యూ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ చెప్పుకోదగ్గ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఏషియన్‌ పెయింట్స్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో దిగ్గజ కంపెనీ ఏషియన్‌ పెయింట్స్‌ నికర లాభం నామమాత్రంగా 2 శాతం తగ్గి రూ. 462 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం 7 శాతం వెనకడుగుతో రూ. 4636 కోట్లకు చేరింది. అయితే ఇబిటా మార్జిన్లు 0.7 శాతం బలపడి 18.5 శాతాన్ని తాకాయి. కాగా.. ఎడిల్‌వీజ్‌, కొటక్‌ సెక్యూరిటీస్‌, యాంటిక్‌ స్టాక్‌ తదితర బ్రోకింగ్‌ సంస్థలు కంపెనీ మార్కెట్ లీడర్‌కావడంతో కోవిడ్‌-19 పరిస్థితుల్లోనూ నిలదొక్కుకోగలదని భావిస్తున్నాయి. లాక్‌డవున్‌ కారణంగా సమీప భవిష్యత్‌లో అమ్మకాలు తగ్గినప్పటికీ రెండు మూడు త్రైమాసికాలలో రికవరీ సాధించగలదని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏషియన్‌ పెయింట్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 1779 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1798 వరకూ ఎగసింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
ప్రభుత్వ రంగ సంస్థ బీవోబీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 507 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 991 కోట్ల నికర నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాంక్‌  తాజా స్లిప్పేజెస్‌ రూ. 3050 కోట్లకు తగ్గినట్లు బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 6798 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 10 శాతం నుంచి 9.4 శాతానికి నీరసించాయి.  ఈ నేపథ్యంలో బీవోబీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 53 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 55 వరకూ ఎగసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top