ఇక అరకు ఇన్‌స్టెంట్‌ కాఫీ ఘుమఘుమలు!

Argha instant coffee now in market - Sakshi

సంక్రాంతికి మార్కెట్లోకి సాచెట్లు

ఏపీ, తెలంగాణల్లో అందుబాటులోకి  సన్నాహాల్లో జీసీసీ  

సాక్షి, విశాఖపట్నం: కమ్మని రుచితో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న అరకు కాఫీ మరో ముందడుగు వేయనుంది. ఫిల్టర్‌ కాఫీలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న అరకు కాఫీ తాజాగా ఇన్‌స్టెంట్‌ రూపంలో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. 2, 10 గ్రాముల సాచెట్లతో సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సన్నద్ధమైంది. ఈ సంక్రాంతి కల్లా మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని జీసీసీ ఎండీ ఆకెళ్ల రవిప్రకాష్‌ ‘సాక్షి’కి చెప్పారు. 2 గ్రాముల సాచెట్‌ రూ.3, 10 గ్రాముల సాచెట్‌ ధర రూ.12గా నిర్ణయించారు. జీసీసీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 120 వరకు పంపిణీదార్లున్నారు. 900 డీఆర్‌ డిపోలు, పెద్ద సంఖ్యలో రిటైల్‌ ఔట్‌లెట్లు, సూపర్‌ మార్కెట్లు ఉన్నా యి. వీటిలో ఇప్పటిదాకా ఇతర కంపెనీల కాఫీ ప్యాకెట్లు/సాచెట్లను విక్రయిస్తున్నారు. వీటి ద్వారా అరకువే లీ ఇన్‌స్టెంట్‌ కాఫీ సాచెట్లను విక్రయించనున్నారు. 

బల్క్‌ ఆర్డర్లు కూడా... 
దేశంలో పలు ప్రాంతాల్లో అరకు కాఫీకి గిరాకీ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి బల్క్‌ ఆర్డర్లు వస్తున్నాయి. ఈనేపథ్యంలో అవసరమైన వారికి బల్క్‌ ఆర్డర్లను కూడా సరఫరా చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఏర్పాటు చేస్తున్న అరకు కాఫీకి ఎంతో ఆదరణ ఉంటోంది. విశాఖ ఏజెన్సీలో కాఫీని సేంద్రియ ఎరువుతో పండిస్తారు. అక్కడ నేల స్వభావం, సేంద్రియ ఎరువుతో పండించడం వల్ల మంచి రుచి, సువాసనను కలిగి ఉంటుంది. అందువల్ల కాఫీ ప్రియులు అరకు కాఫీని అమితంగా ఇష్టపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సాచెట్లను ప్రవేశపెట్టాలని జీసీసీ నిర్ణయించింది. ఏలూరులో ఉన్న వాహన్‌ కాఫీ  కేంద్రంలో ఇన్‌స్టెంట్‌ కాఫీ సాచెట్లను తయారీ, ప్యాకింగ్‌లను చేపడుతున్నారు. ప్రాథమికంగా 2 గ్రాముల ఇన్‌స్టెంట్‌ కాఫీ మూడు లక్షలు, 10 గ్రాముల సాచెట్లు లక్ష చొప్పున తయారు చేయనున్నారు. ఇందుకు 7 టన్నుల కాఫీ పొడి అవసరమని భావిస్తున్నారు. ఆదరణకనుగుణంగా మున్ముందు ఈ సాచెట్ల తయారీని విస్తృతం చేస్తామని రవిప్రకాష్‌ తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top