అపోలో మ్యూనిక్‌కు ప్రమోటర్లు గుడ్‌బై!

Apollo Hospitals founders may exit Apollo Munich Health Insurance - Sakshi

41 శాతం వాటాలకు  రూ.1,200 కోట్ల డీల్‌? 

నాలుగు సంస్థలతో చర్చలు...

ఆరు నెలల్లోగా డీల్‌  పూర్తయ్యే అవకాశాలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణభారం తగ్గించుకునే దిశగా ఆరోగ్య బీమా సేవలందించే జాయింట్‌ వెంచర్‌ సంస్థ అపోలో మ్యూనిక్‌ హెల్త్‌లో వాటాలను విక్రయించడంపై అపోలో హాస్పిటల్స్‌ ప్రమోటర్స్‌ కసరత్తు చేస్తున్నారు. ఇందులో అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు ప్రతాప్‌ సి. రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 41 శాతం వాటాలు ఉన్నాయి. వీటిని సుమారు రూ. 1,200 కోట్లకు విక్రయించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నాలుగు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని, వీటిలో రెండు ఈక్విటీ ఫండ్‌ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నాయి. వచ్చే ఆరు నెలల్లో వాటాల విక్రయం పూర్తి కావొచ్చని అంచనా. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్‌ రుణభారం సుమారు రూ. 3,430 కోట్లుగా ఉంది. సంస్థలో ప్రమోటర్స్‌కు 34 శాతం వాటాలు ఉండగా గతేడాది డిసెంబర్‌ ఆఖరు నాటికి ఇందులో దాదాపు 74 శాతం వాటాలు తనఖాలో ఉన్నట్లు తెలుస్తోంది. రుణభారాన్ని తగ్గించుకునేందుకు అపోలో ప్రమోటర్స్‌ ఈ నిధులను వినియోగించారు.  రుణాలు తీర్చేందుకు తనఖా ఉంచిన షేర్ల పరిమాణం ఈ మధ్య కాలంలో కొంత పెరిగిందన్న అపోలో ఎండీ సునీతా రెడ్డి.. వచ్చే ఆరు నెలల వ్యవధిలో దాన్ని 50 శాతానికి తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇటీవల తెలిపారు. అయితే, బీమా వెంచర్‌లో వాటాల విక్రయానికి సంబంధించిన వార్తలపై మాత్రం స్పందించలేదు.
 
గతంలోనే కొంత వాటా విక్రయం.. 
2007లో ప్రారంభమైన అపోలో మ్యూనిక్‌ సంస్థ ఆరోగ్య, ప్రమాద బీమా, ప్రయాణ బీమా పథకాలను అందిస్తోంది. జర్మనీకి చెందిన మ్యూనిక్‌ ఆర్‌ఈ గ్రూప్‌లో భాగమైన డీకేవీ ఏజీతో కలిసి దీన్ని ఏర్పాటు చేయడంతో ప్రారంభంలో సంస్థ పేరు అపోలో డీకేవీగా ఉండేది. ఆ తర్వాత 2009లో అపోలో డీకేవీ పేరును అపోలో మ్యూనిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌గా మార్చారు. దీన్ని ప్రారంభించినప్పుడు అపోలో హాస్పిటల్, డీకేవీ ఏజీ వాటాలు 74:26 నిష్పత్తిలో ఉండేవి. ఆ తర్వాత 2016 జనవరిలో మ్యూనిక్‌ ఆర్‌ఈ.. అపోలో మ్యూనిక్‌లో 23.27 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దీంతో సంస్థలో మ్యూనిక్‌ ఆర్‌ఈ వాటా 48.75 శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబర్‌ నాటికి భారత్‌లో అపోలో మ్యూనిక్‌కు 180 కార్యాలయాలు, 3,200 మంది ఉద్యోగులున్నారు. గతడాది మార్చి ఆఖరు నాటికి అపోలో మ్యూనిక్‌ సంస్థ స్థూల ప్రీమియం వసూళ్లు రూ. 1,720 కోట్లుగా ఉన్నాయి. బుధవారం బీఎస్‌ఈలో అపోలో హాస్పిటల్స్‌ షేరు సుమారు 1 శాతం పెరిగి రూ. 1,146.60 వద్ద క్లోజయ్యింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top