అనిల్‌ అంబానీకి సుప్రీంకోర్టు షాక్‌

Anil Ambani Held Guilty of Contempt, to Be Jailed if he fails to pay Rs 453 crore - Sakshi

అప్పులను తీర్చే ఉద్దేశం ఆర్‌కాంకు లేదు- సుప్రీంకోర్టు

4 వారాల్లో బకాయిలు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష

కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే - సుప్రీంకోర్టు

అనిల్‌ అంబానీ, ఇద్దరు డైరెక్టర్లకు కోటి రూపాయల జరిమానా

సాక్షి, న్యూఢిల్లీ: ఎరిక్‌సన్‌ ఇండియా వివాదంలో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి మరోసారి భారీ షాక్‌ తగిలింది. రూ. 550 కోట్ల బకాయిలను చెల్లించే ఉద్దేశం ఆర్‌కాంకు లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగువారాలలో ఎరిక్‌సన్‌ ఇండియాకు రూ. 453 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.  దీంతోపాటు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఎరిక్‌సన్‌ వాదనను కోర్టు సమర్ధించింది.  

కేవలం క్షమాపణ చెబితే సరిపోదని  ఆర్‌కాంకు  సుప్రీం మొట్టికాయలేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించాలని వ్యాఖ్యానించింది. ఇందుకు అనిల్‌ అంబానీతో పాటు ఇద్దరు డైరెక్టర్లను (రిలయన్స్ టెలికం ఛైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్  అధ్యక్షురాలు ఛాయా విరాని) ఈ కేసులో దోషులుగా సుప్రీం తేల్చింది. ఒక్కొక్కరికీ కోటి రూపాయల జరిమానా కూడా విధించింది. నెల రోజుల్లోగా వీటిని డిపాజిట్‌ చేయవలసిందిగా ఆదేశించింది. లేదంటే నెలరోజుల పాటు జైలుకెళ్లాల్సి వుంటుందని తీర్పు చెప్పింది. 

4 వారాల్లో ఈ సొమ్మును చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. మరోవైపు అనిల్‌ అంబానీని అరెస్ట్‌ చేయాలన్న ఎరిక్‌సన్‌ పిటీషన్‌ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో  బుధవారం నాటి  లాభాల మార్కెట్లో  అడాగ్‌ గ్రూపు షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 

కాగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్‌కాం ఎరికసన్‌ బ​కాయిలను చెల్లించడంలో ఇప్పటికే రెండుసార్లు విఫలమైంది. రిలయన్స్ జియోకు ఆస్తుల విక్రయం ద్వారా నిధుల సమీకరణ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఆస్తుల విక్రయంలో విఫలంకావడంతో నిధుల కొరత కారణంగా ఎరిక్‌సన్‌కు చెల్లింపులను చేయలేకపోయానని అనిల్‌ అంబానీకి కోర్టుకు తెలిపారు. అయితే 2018 డిసెంబర్‌ 15లోగా బకాయిలను చెల్లించవలసిందిగా గత అక్టోబర్‌ 23న కోర్టు అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) సంస్థ ఆర్‌కామ్‌ను సుప్రీం ఆదేశించింది. ఆలస్యం చేస్తే 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించింది కూడా.  అయినా బకాయిలు చెల్లించకపోవడంతో అనిల్‌ అంబానీని కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపాలనీ, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలంటూ ఎరిక్‌సన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తం రూ. 550కోట్లను చెల్లించాల్సిందిగా అనిల్‌ అంబానీకి ఆదేశాలు జారీచేయమంటూ కోర్టును అభ్యర్థించింది. దీన్ని విచారించిన  సుప్రీం తాజా ఆదేశాలిచ్చింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top