షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన అలీబాబా కో ఫౌండర్‌

Alibaba Jack Ma to retire - Sakshi

న్యూయార్క్‌ : చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు,ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్‌ మా షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. 420 బిలియన్ల డాలర్ల సంస్థనుంచి వైదొలగాలని యోచిస్తున్నట్టు చెప్పారు. విద్యారంగంలో దాతృత్వతను కొనసాగించేందుకు, పదవీ విరమణ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ అంశంపై సమాధానాన్ని దాటవేస్తూ తే వచ్చిన జాక్‌ చివరికి తన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే  అలీబాబా  బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా, కంపెనీ నిర్వహణ మార్గదర్శిగా కొనసాగుతారు.  న్యూయార్క్‌ టైమ్స్‌  ఈ విషయాన్ని రిపోర్టు చేసింది.

ఇటీవల దాతృత్వంపై మరింత దృష్టి కేంద్రీకరించడంపై ఆలోచిస్తున్నానంటూ, మైక్రోసాఫ్ట్ అధిపతి, దాత బిల్ గేట్స్‌ను ఉదాహరణగా పేర్కొన్న జాక్‌ చివరికి అన్నంత పనీ చేశారు. విద్య అంటే తనకు అమితమైన ప్రేమ అని అందుకే తన భవిష్యత్‌  సమయాన్ని ఇక విద్యకే కేటాయిస్తానని పేర్కొన్నారు. ఇది  ముగింపు కాదని మరో కొత్త శకానికి నాంది అని చైనీస్ బిలియనీర్ జాక్‌ మా వ్యాఖ్యానించారు. 

అలీబాబా, టెన్సెంట్, బైడు, జెడి.కామ్‌ సంస్థలను తన ఆధ్వర్యంలో లాభాల దౌడు తీయించి, అమెరికన్‌ సంస్థలు అమెజాన్, గూగుల్ లాంటి సంస్థల గుండెల్లో గుబులు రేపిన ఘనత జాక్‌ సొంతం.గత నెల వెల్లడించిన ఆలీబాబా త్రైమాసిక ఫలితాల్లో లాభాలు పడిపోయినప్పటికీ, అమ్మకాలలో 60 శాతం పురోగతి సాధించింది. కంపెనీ వార్షిక ఆదాయం సుమారు 40బిలియన్ డాలర్లుగా నమోదైంది.  మరోవైపు చైనాలో టీచర్స్‌డేగా వ్యవహరించే (సెప్టెంబరు10, సోమవారం) ఆయన 54వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నారు. కాగా చైనా వ్యాపార దిగ్గజాలు యాభైవ పడిలో పదవికి రాజీనామా చేయడం చాలా అరుదని ఎనలిస్టులు చెబుతున్నారు. మల్టీబిలియన్ డాలర్ల ఇంటర్నెట్ దిగ్గజం ఆవిష్కారానికి ముందు జాక్‌ ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేశారు.1999లోమరో 17మందితో కలిసి  ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ఇ-కామర్స్, డిజిటల్ చెల్లింపుల సంస్థ ఆలీబాబాకు ప్రాణం పోశారు జాక్‌ మా.  ఈ వార్తలపై జాక్‌మా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top