సెబీ చైర్మన్‌గా అజయ్‌ త్యాగి బాధ్యతలు | Sakshi
Sakshi News home page

సెబీ చైర్మన్‌గా అజయ్‌ త్యాగి బాధ్యతలు

Published Thu, Mar 2 2017 1:02 AM

సెబీ చైర్మన్‌గా అజయ్‌ త్యాగి బాధ్యతలు

ముంబై: క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ చైర్మన్‌గా సీనియర ఐఏఎస్‌ అధికారి అజయ్‌ త్యాగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సెక్యూరిటీస్‌  అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌  ఆఫ్‌  ఇండియా(సెబీ) తొమ్మిదవ చైర్మన్‌గా త్యాగి వ్యవహరించనున్నారు. ఆరేళ్ల పాటు చైర్మన్‌గా పనిచేసిన యు.కె. సిన్హా స్థానంలో త్యాగి వచ్చారు. 58 సంవత్సరాల త్యాగి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.  హిమాచల్‌ ప్రదేశ్‌ క్యాడర్, 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి త్యాగి ఆర్థిక మంత్రిత్వ శాఖలో గతంలో క్యాపిటల్‌ మార్కెట్‌ విభాగాన్ని నిర్వహించారు. ఆయన కేంద్రంలో పలు బాధ్యతలు నిర్వహించారు.

పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖకు సంయుక్త కార్యదర్శిగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేసారు. పెట్రోలియమ్, నేచురల్‌ గ్యాస్, ఉక్కు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల్లో పలు హోదాల్లో ఆయన కార్యకలాపాలు నిర్వర్తించారు.  ఉత్తర ప్రదేశ్‌కు చెందిన త్యాగి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. హార్వర్డ్‌ యూనివర్శిటీ నుంచి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేశారు.  ఇక యూకే సిన్హా సెబీ చైర్మన్‌గా ఆరేళ్ల పాటు పనిచేశారు. అధిక కాలం సెబీ చైర్మన్‌గా పనిచేసిన వాళ్లలో సిన్హా రెండో వ్యక్తి. డి. ఆర్‌ . మెహతా1995 నుంచి 2002 వరకూ ఏడేళ్ల పాటు సెబీ చైర్మన్‌గా వ్యవహరించారు. సిన్హాకు ముందు సి. బి. భవే. ఎం. దామోదరన్, జి.ఎన్‌. బాజ్‌పాయ్‌లు మూడేళ్ల చొప్పున సెబీ చైర్మన్‌గా పనిచేశారు.

Advertisement
Advertisement