ఎయాన్‌–జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ చేతికి మోనెట్‌ ఇస్పాత్‌ 

Aion-JSW Steel wins Monnet Ispat bid; banks take 75% haircut - Sakshi

రూ. 2,875 కోట్ల బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం 

బ్యాంకులకు 74% హెయిర్‌కట్‌ 

ముంబై: రుణభారంతో దివాలా తీసిన మోనెట్‌ ఇస్పాత్‌ సంస్థను ఎయాన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌–జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కన్సార్షియం దక్కించుకోనుంది. ఇందుకోసం కన్సార్షియం సమర్పించిన రూ. 2,875 కోట్ల బిడ్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించింది. మోనెట్‌ ఇస్పాత్‌ బ్యాంకులకు ఏకంగా రూ. 11,000 కోట్ల మేర బాకీ పడింది. ఎయాన్‌–జేఎస్‌డబ్ల్యూ కన్సార్షియం బిడ్‌ ద్వారా 26 శాతం మాత్రమే వసూలు కానుండటంతో.. బ్యాంకులు ఏకంగా 74 శాతం మొత్తాన్ని వదులుకోవాల్సి (హెయిర్‌కట్‌) రానుంది. దీనికోసం బిడ్‌ చేసిన ఏకైక బిడ్డరు తమ కన్సార్షియమేనని జేఎస్‌డబ్ల్యూ తెలిపింది. వాస్తవ బిడ్‌కు కొన్ని మార్పులతో ఎన్‌సీఎల్‌టీ గురువారం మౌఖిక ఉత్తర్వులు ఇచ్చిందని, పూర్తి ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉందని వివరించింది.

అయితే, ఏయే మార్పులను సూచించినదీ వెల్లడించడానికి సంస్థ నిరాకరించింది. మోనెట్‌లో కన్సార్షియానికి 75 శాతం వాటాలు ఉంటాయని ఎయాన్‌ వివరించింది. ఇందులో తమకు 70 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కి 5 శాతం ఉంటుందని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో 1.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్ధ్యం గల స్పాంజ్‌ ఐరన్‌ ప్లాంటుతో  మోనెట్‌ ఇస్పాత్‌ ఒకప్పుడు ఉక్కు దిగ్గజంగా వెలుగొందింది. అయితే, దానికి కేటాయించిన బొగ్గు గనులను 2014లో సుప్రీం కోర్టు రద్దు చేయడం, ఆ తర్వాత ఉక్కు రేట్లు భారీగా పడిపోవడం తదితర కారణాలతో సంక్షోభంలో కూరుకుపోయింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top