సైబర్‌ మోసాలపై టెకీల పోరు

7 internet companies join hands to check online fraud - Sakshi

ఎంఎంటీ, స్విగ్గీ, జొమాటో, పేటీఎం జట్టు

ఆర్‌బీఐతో భేటీ

మోసాల నివారణ చర్యలపై సమీక్ష

టెల్కోలు, గూగుల్‌తోనూ చర్చలు

బెంగళూరు: సైబర్‌ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ట్రావెల్‌ సేవల సంస్థలు మేక్‌మైట్రిప్‌ గ్రూప్, ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌.. మొబైల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ స్విగ్గీ, జొమాటోలతో పాటు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌ మొదలైనవి ఇందుకోసం జట్టు కట్టాయి. సైబర్‌ మోసాల తీరుతెన్నులు, నివారణ తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు ఈ సంస్థలు గతవారం రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసపూరిత టోల్‌ ఫ్రీ నంబర్లు మొదలైన మార్గాల్లో మోసాలు జరుగుతున్న తీరును అవి వివరించినట్లు పేర్కొన్నాయి.

అమాయక కస్టమర్లను మోసగించేందుకు ఉపయోగిస్తున్న 4,000 పైచిలుకు సిమ్‌ కార్డు నంబర్లు, 350–400 దాకా బ్యాంకు ఖాతాల వివరాలను రిజర్వ్‌ బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో పాటు టెలికం కంపెనీలకు కూడా అందించినట్లు వివరించాయి. అటు నకిలీ టోల్‌ ఫ్రీ నంబర్లు పేజీలో ప్రముఖంగా పైన కనిపించే విధంగా నేరగాళ్లు ఏ విధంగా సెర్చి ఇంజిన్‌ను దుర్వినియోగం చేస్తున్నదీ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు కూడా ఆయా టెక్‌ దిగ్గజాలు తెలియజేశాయి. సాధారణంగా ఇలా సెర్చి ఇంజిన్‌ పేజీలో పైన ప్రముఖంగా కనిపించే నకిలీ టోల్‌ ఫ్రీ నంబర్లను వినియోగదారులు అసలైనవిగా భావించి.. మోసాల బారిన పడుతున్న ఉదంతాలు అనేకం నమోదవుతున్నాయి.

ఎస్‌బీఐకు లేఖ..
గత కొద్ది వారాలుగా ఈ ఇంటర్నెట్‌ కంపెనీలు.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో పాటు టెలికం రంగానికి చెందిన ఎయిర్‌టెల్‌ తదితర సంస్థలతో కూడా సమావేశాలు జరుపుతున్నాయి. ప్రభుత్వ రంగంలోనే అతి పెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా ఆన్‌లైన్‌ కంపెనీలు లేఖ రాశాయి. ఎస్‌బీఐ ఖాతాలను ఉపయోగించి భారీ స్థాయిలో జరుగుతున్న సైబర్‌ మోసాల గురించి తెలియజేశాయి. అమాయక ఖాతాదారులను మోసగించేందుకు.. కీలకమైన వారి అకౌంట్ల వివరాలను తెలుసుకునే నేరగాళ్లు చాలామటుకు ఎస్‌బీఐ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు వివరిం చాయి. ఎస్‌బీఐ భారీ బ్యాంకు కావడంతో ఇలాంటి వారిని పట్టుకోవడం కష్టతరం కావొచ్చని టెక్‌ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ మోసాలను అరికట్టడానికి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి.  రాబోయే రోజుల్లో మరిన్ని టెక్‌ కంపెనీలు ఈ సంస్థలతో జట్టు కట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మోసాలు ఇలా..
ఎక్కువగా పట్టణేతర ప్రాంతాల వారు, సీనియర్‌ సిటిజన్లు ఇలాంటి సైబర్‌ నేరాల బారిన పడుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఖాతాగా భ్రమింపచేసే అకౌంటు నుంచి ఎస్‌ఎంఎస్‌లు పంపించడం ద్వారా నేరగాళ్లు  మోసాలకు తెరతీస్తున్నారు. సిసలైన కంపెనీగా కనిపించినప్పటికీ.. ఇలాంటి పోర్టల్‌ పేర్లలో ఎక్కడో ఒకటో అరా తేడాలుంటున్నాయి. ఉదాహరణకు.. మేక్‌మై ట్రిప్‌ పోర్టల్‌ వంటి పోర్టల్స్‌ పేర్లలో నకిలీ సైట్లు అదనంగా మరో అక్షరం చేరుస్తున్నాయి. ఆకర్షణీయ బహుమతుల ఆఫర్లతో  తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇలాంటి మెసేజ్‌లను  వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆయా లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా మోసాల బారిన పడుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top