అక్షర దోషంతో 4 రెట్లు పెరిగిన వేతనం

4 times the wage with a typo - Sakshi

రూ.3.91 కోట్ల నుంచి రూ.16.80 కోట్లకు

సీఈవో వేతనంపై ఫోర్టిస్‌ వివరణ  

న్యూఢిల్లీ: అక్షర దోషంతో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ సీఈవో భవదీప్‌ సింగ్‌ వేతనం కాస్తా రూ.13 కోట్లు పెరిగిపోయింది. 2015 జూలై నుంచి 2017 మార్చి మధ్య కాలంలో భవదీప్‌ సింగ్‌ వేతనం నాలుగు రెట్లు పెరగ్గా, అదే కాలంలో కంపెనీ పనితీరు క్షీణించడం గమనార్హం. 2015 జూలైలో సింగ్‌ను రూ.3.91 కోట్ల వేతనానికి సీఈవోగా ఫోర్ట్‌స్‌ హెల్త్‌కేర్‌ నియమించుకుంది. మరుసటి సంవత్సరమే ఆయన వేతనం రూ.16.80 కోట్లకు పెరిగింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కంపెనీ నివేదికల ఆధారంగా ఈ విషయాలు తెలిశాయి.

అయితే, భవదీప్‌ సింగ్‌ వేతన గణాంకాల్లో ముద్రిత దోషం ఉన్నట్టు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. ‘‘2016–17 ఆర్థిక సంవత్సరం నివేదికలో నంబర్‌ తప్పుగా ముద్రితమైంది. దీంతో  సింగ్‌ ఆదాయం అధికంగా కనిపించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నివేదికలో సవరణ ప్రచురిస్తాం. వాస్తవానికి ఆ రెండు సంవత్సరాల్లో సింగ్‌ వేతనం కంపెనీ నిబంధనలకు అనుగుణంగా 6%, 8% చొప్పునే పెరిగింది’’ అని కంపెనీ ప్రతినిధి వివరించారు. అయితే ఈ అంకెలు వరుసగా రెండేళ్లు ఎలా తప్పు వస్తాయని షేర్‌ హోల్డర్లు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. కంపెనీ తీవ్ర కుంభ కోణాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top