సాక్షి, న్యూఢిల్లీ : రెగ్యులేటరీ నిబంధనలను పాటించకపోవడంతో 2.26 లక్షలకు పైగా కంపెనీలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల నుంచి తీసివేసినట్టు ప్రభుత్వం నేడు ప్రకటించింది. వీటిలో ఎక్కువ సంస్థలు మహారాష్ట్రకు చెందినవేనని ప్రభుత్వం తెలిపింది. 2.97 లక్షల కంపెనీలు గత రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి తమ వార్షిక రిటర్నులను దాఖలు చేయడం లేదని 2017-18లో ఆర్‌ఓసీ గుర్తించిందని, వారు ఎలాంటి కార్యకలాపాలను కూడా చేపట్టడం లేదని కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభకు నివేదించారు. గుర్తించిన కంపెనీల్లో 2.26 లక్షల కంపెనీలను కంపెనీల యాక్ట్ 2013 సెక్షన్ 248 కింద ఆర్‌ఓసీ తొలగించింది అని తెలిపారు.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీల యాక్ట్ సెక్షన్ 248ను అమలు చేస్తుంది. దీని ప్రకారం దీర్ఘకాలికంగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వర్తించకుండా హవాలా లావాదేవీలు నడుపుతున్న కంపెనీల పేర్లను రిజిస్ట్రార్ నుంచి తొలగిస్తారు. మొత్తం డీరిజిస్ట్రర్ అయిన సంస్థల్లో ఎక్కువగా మహారాష్ట్రకు చెందినవే ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి దాదాపు 59,849 కంపెనీలు డీరిజిస్ట్రర్ అయ్యాయి. తర్వాత 43,925 కంపెనీలతో ఢిల్లీ, 24,723 కంపెనీలతో తమిళనాడు, 18,165 కంపెనీలతో కర్నాటక, 16,817 కంపెనీలతో తెలంగాణ, 11,389 కంపెనీలతో గుజరాత్‌లు ఉన్నాయి. దీర్ఘకాలికంగా కార్యకలాపాలు కొనసాగించని కంపెనీల పేర్లనే తొలగించినట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు.


