యువనేస్తం...రిక్తహస్తం

Yuva Nestham Scheme Going Wrong - Sakshi

సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకమునుపు ఒక మాట.. వచ్చిన తర్వాత మరొక మాట చెబుతూ ముందుకు వెళుతోంది. ఒక్కటేమిటి రుణమాఫీ మొదలుకొని నిరుద్యోగ భృతి వరకు చెప్పిందొకటి...చేసేది మరొకటిగా మారింది. నిరుద్యోగ భృతి విషయంలోనూ దాదాపు నాలుగున్నరేళ్ల పుణ్యకాలం గడిచినంత వరకు మొద్దునిద్రలో ఉన్న టీడీపీ సర్కార్‌ ఎన్నికల నేపథ్యంలో మేలుకుంది. అదీ కూడా ఇంటింటికి ఉద్యోగం.. లేకుంటే ప్రతి నిరుద్యోగికి రూ. 2 వేలు భృతి అంటూ దండోరా వేసిన తెలుగుదేశం ప్రభుత్వం రూ. 1000లకే పరిమితమై మార్చి నెలలో మాత్రం రూ. 2000 ఎన్నికల స్టంట్‌తో పెంచేశారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో జిల్లాలో వేల మంది దరఖాస్తు చేస్తే  రకరకాల నిబంధనల పేరుతో అధికశాతం మందికి మొండి చేయి చూపి కొంతమందికే భృతి ఇస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం.

అంతంత మాత్రమే..
ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌లో దాదాపు 7.15 లక్షల పైచిలుకు నమోదైనా ఓటీపీ జనరేట్‌ చేసిన వారు 5.73 లక్షల మంది ఉన్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తుకు ప్రయత్నించారు. అయితే నిబంధనల సాకుతో అందరినీ కోత కోసేశారు. కొందరికి ఓటీపీ రిజెక్ట్‌ అయితే, మరికొందరికి సక్సెస్‌ అయినా సర్టిఫికెట్లు సబ్మిట్‌ చేయలేదనో, చదువు ఇది కాదనో లేదా వయస్సు దాటిపోయిందనో సాకులు చూపుతూ యువతకు భృతిని దూరం చేస్తున్నారు.

జిల్లాలో 31,164  మందికి భృతి
ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 31 వేల 124 మందిని మాత్రమే అర్హులుగా తేల్చి మొత్తాన్ని అందిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇంటింటికి ఉద్యోగం...లేకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్నా తీరా చివరలో రూ. 1000 పేరుతో మొదలు పెట్టారు.

జిల్లాలో భారీగా నిరుద్యోగులు
జిల్లాలో అధికారికంగా తక్కువ సంఖ్య చూపిస్తున్నా జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు.  రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. భృతి రాక, ఉద్యోగం లేక తల్లడిల్లిపోతున్న నిరుద్యోగులు ప్రభుత్వ తీరును తూర్పార బడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి యువనేస్తం దరఖాస్తు వివరాలు 
వెబ్‌సైట్‌లో దరఖాస్తుకు యత్నించినవారు : 7,15,343
ఓటీపీ జనరేట్‌ చేసిన వారు : 5,73,462
ఓటీపీ ఫెయిల్‌ అయిన వారు : 1,41,881
మార్చి నెల వరకు భృతి పొందుతున్న నిరుద్యోగులు : 31,124
జిల్లాకు ప్రస్తుతం మంజూరైన నిరుద్యోగుల సంఖ్య : 36,304
అధికారికంగా అర్హులుగా ప్రభుత్వం గుర్తించిన నిరుద్యోగులు : 64,265

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top