
సమరమే..
రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని, సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, త్వరలోనే తెలుగుదేశం పార్టీని పాతాళంలో కలిపేందుకు ప్రజలు
♦ అరాచక పాలనకు చరమగీతం..
♦ కార్యకర్తలపై దాడులను సహించేది లేదు
♦ జగన్ పేరు వింటేనే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు
♦ వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీలో గళమెత్తిన నాయకులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని, సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, త్వరలోనే తెలుగుదేశం పార్టీని పాతాళంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు పునరుద్ఘాటించారు. ఆదివారం ఏలూరు మినీబైపాస్ రోడ్డులోని క్రాంతి కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రుణమాఫీ ఫైలుపై సంత కం చేసిన చంద్రబాబు మూడేళ్లయినా ఆ హామీని నెరవేర్చలేకపోయారని, అదేమని అడిగితే కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. డ్వాక్రా మహిళలు, అన్నదాతలను నమ్మించి నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
సువర్ణ పాలన జగన్‌తోనే సాధ్యం : బొత్స
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీలో అందరూ దొంగలేనని, ప్రతి నేతకూ ఓ మచ్చ ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు హాయిగా నిద్రపోవాలంటే దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాటి స్వర్ణయుగం తిరిగి రావాలని, అది ఒక్క వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. టీడీపీ తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బెదిరిపోయేంత పిరికివాళ్లు కాదన్నారు. వారు గ్రామాన్ని, మండలాన్ని, నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలరని, 2019లో జరిగే మహా సంగ్రామంలో సడలని పోరాట పటిమతో పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
మైనార్టీలకు అన్యాయం
పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. మైనార్టీలకు ఏడాదికి రూ.1500 కోట్లు ఇస్తానని చెప్పిన బాబు తన మూడేళ్ల పాలనలో ఇప్పటికీ రూ.1500 కోట్లను ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ఉపాధి పథకాన్ని సాగుకు అనుసంధానం చేయాలి
ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, చేనేత రంగంలో ఉత్పత్తి చేసే ప్రతి వస్త్రానికీ 30 శాతం రిబేటు ఇవ్వాలని, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఆర్‌ఆర్‌ఆర్ పథకం కింద రూ.100 కోట్లు కేటాయించాలని తీర్మానించారు.
బాబుకు ప్రజలంటే చిన్నచూపు
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ నాయకులు గడపగడపకూ వైఎస్సార్ పేరుతో ప్రజలను కలుస్తుంటే టీడీపీ నాయకులు భయపడుతున్నారన్నారు. నవ్యాంధ్ర కొత్త రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా అంశాలను చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు. ఇప్పటికీ సాగు, తాగు నీటి కోసం పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుకు వ్యవసాయమంటే చులకన అని, రైతులన్నా.. ప్రజలన్నా.. చిన్నచూపని విమర్శించారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వంకా రవీంద్ర మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తరఫున జిల్లాలో ఒక గొప్ప టీం పనిచేస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు.
పరిశ్రమల స్థాపన కోసం బాబు రూ.200 కోట్లు ఖర్చుపెట్టి విదేశాలు తిరిగి వచ్చారు.. తప్ప ఇప్పటికీ ఒక్క విదేశీ పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు వంకా రవీంద్ర, కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరు ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, పాతపాటి సర్రాజు, తెల్లం బాలరాజు, తానేటి వనిత, గంటా మురళీరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నియోజకవర్గ సమన్వయకర్తలు కవురు శ్రీనివాస్, దయాల నవీన్ బాబు, కొఠారు రామచంద్రరావు, తలారి వెంకటరావు, పుప్పాల వాసుబాబు, రాజీవ్‌కృష్ణ, గుణ్ణం నాగబాబు, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ ఇందుకూరి రామకృష్ణం రాజు, పార్టీ నేతలు చీర్ల రాధయ్య తదితరులు పాల్గొన్నారు.
జగన్ పేరు వింటే టీడీపీ నేతలకు హడల్
ప్లీనరీకి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్లాడుతూ ఇటీవల కొవ్వూరులో జరిగిన టీడీపీ మినీ మమానాడులో గానీ, రాష్ట్రస్థాయిలో జరిగిన మహానాడులో గానీ టీడీపీ నాయకులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేరు ఎత్తకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ పేరు చెబితే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇటీవల కర్నూలులో జరిగిన సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని, ఇది ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. నంధ్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే అక్కడి ప్రజలను భయపెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు రూ.5 వేలు ఇస్తానని అనడం బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు. పైగా ఆ 5 వేలూ తిరిగి ప్రజల వద్ద నుంచే వసూలు చేస్తాననడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు కుటిల యత్నాలను తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 3 పార్లమెంట్, 15 అసెంబ్లీ స్థానాలనూ వైఎస్సార్ సీపీకి కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు.