 
													సాక్షి, అమరావతి : వైఎస్సార్ జయంతి నాడే ఉచిత రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ నెల 8న ప్రతిష్టాత్మకంగా రైతు దినోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పులివెందులలో అరటి పరిశోధన కేంద్రానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారన్నారు. రైతు బీమా పథకంలో భాగంగా ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రూ. 7లక్షల బీమా చెల్లిస్తామన్నారు. పలు ప్రాంతాల్లో రైతులకు అవసరమైన యంత్రాలు పంపిణీ చేస్తామన్నారు.
పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వేరుశనగకు క్వింటాల్‌కు రూ. 1500 మద్దతు ధర ప్రకటించినట్లు కన్నబాబు తెలిపారు. వేరు శనగ విత్తనాల కొరతను సరిదిద్దామన్నారు. 3.13లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేశామన్నారు. ఉత్తరాంధ్రలో సరిపడ వరి విత్తనాలు సరఫరా చేసినట్లు తెలిపారు. రైతు దినోత్సవం నాడు రైతుల సమస్యలకు సంబందించిన ఫిర్యాదులను కూడా స్వీకరిస్తామని తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
