వైఎస్సార్‌సీపీతోనే యాదవులకు న్యాయం

YSRCP Justice For Yadava Community - Sakshi

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమాజంలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి యాదవ కులానికి చెందిన నర్తు రామారావు, నర్తు నరేంద్రయాదవ్‌లకు అవకాశం కల్పించారని వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. నగరంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో మామిడి శ్రీకాంత్‌ అధ్యక్షతన బూర పాపారావు, కలగ శ్రీనివాస్‌యాదవ్, గద్దెబోయిన కృష్ణ సమక్షంలో జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందిన సుమారు 500 మంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, కృపారాణి, ధర్మాన రామ్‌మనోహర్‌ నాయుడు వారికి వైఎస్సార్‌ సీపీ కండువాలు వేసి సాదారంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం యాదవులను అంటరాని వారిలా చూస్తోందని, వారి ప్రగతి కోసం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. జిల్లాకు చెందిన బీసీ మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో ఓ గ్రామంలో యాదవ కులానికి చెందిన వ్యక్తి జెడ్పీటీసీ టికెట్‌ ఇవ్వాలని కోరగా.. ‘బస్సు టికెట్‌ కాదు..?’ అని వ్యంగ్యంగా మాట్లాడిన తీరు బాధాకరణమన్నారు. రైతులు తమ కూరగాయలు అమ్ముకునేందు రైతు బజార్లు ఎలా ఏర్పాటు చేశారో.. యాదవులు గొర్రెలు, మేకలు విక్రయించుకునేందుకు ప్రత్యేకంగా మార్కెట్‌ చేస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు. బంజరు భూముల్లో మేకలు, గొర్రెలు మేతకు అవకాశం కల్పిస్తామని జీఓ 559ని అమలు చేయలేదని గుర్తుచేశారు. జిల్లాలో యాదవుల అభివృద్ధికి కృషిచేసే అనుభవజ్ఞుడైన ధర్మాన ప్రసాదరావు, ఎంపీ అభ్యర్థి దువ్వాడను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కార్పొరేషన్‌కు కృషి
వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ యాదవులంటే.. తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి తొలి దర్శనం దక్కిన వారని, నమ్మిన వారికోసం ప్రాణాలను సైతం లెక్క చేయరనే గొప్పవారని పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న యాదవులకు ఎమ్మెల్సీ పదవి, కార్పొరేషన్‌ ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు మాట్లాడుతూ టీడీపీ మరోసారి ఓట్లు వేయించుకోవడం కోసం... ‘అధికారంలోకి వస్తే చచ్చిపోయిన గొర్రెలను బతికిస్తామని’ కూడా హామీలిస్తారని ఎద్దేవా చేశారు. ధర్మాన ప్రసాదరావుకి యాదవులంటే ఎనలేని గౌరవమని, ఆయనకు అండగా ఉండాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్లు ఎంవీ పద్మావతి, అంధవరపు వరహానరసింహం(వరం), బాలకృష్ణయాదవ్, సంఘం పెద్దలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top