వైఎస్సార్‌సీపీ చేయూత .. ముస్లింల భవిత

YSRCP Give More Development To The Muslim Community People - Sakshi

4 శాతం రిజర్వేషన్ల అమలు

ఎన్నికల మేనిఫెస్టోలోనూ ముస్లింలకు జగన్‌ ప్రాధాన్యం

వైఎస్సార్‌ పెళ్లి కానుక రూ.లక్ష

ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలు

ప్రత్యేక సబ్‌ప్లాన్‌ అమలు

పేరుకు నవాబులుగా కీర్తించబడే ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా  చితికిపోయి గరీబులుగా మారిపోయారు. దశాబ్దాలుగా అణచివేతకు గురైన ముస్లిం మైనార్టీలు సరైన చేయూత లేక మరింత చితికి పోయారు. 2004 కంటే ముందు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలది దయనీయ పరిస్థితి. ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూపంలో ముస్లింల జీవితాల్లో వెలుగురేఖ అవతరించింది. తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ముస్లింల కష్టాలు కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలకు కట్టుబడి, ముస్లిం సంక్షేమానికి, వారి అభివృద్ధికి పెద్దపీఠ వేశారు. ఆ మహానేత తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ముస్లింల సంక్షేమానికి తిలోదకాలిచ్చేశారు. వైఎస్సార్‌ ఆశయ సాధనకు పరితపిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింల సంక్షేమానికి, చేయూతకు తన ఎన్నికల మేనిఫెస్టోలో దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించారు.

నెల్లూరు (వేదాయపాళెం): ముస్లిం మైనార్టీల సంక్షేమం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమవుతుందని జిల్లా వ్యాప్తంగా ఆ వర్గాలు భావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మారతాయని, ఆయనే సీఎం కావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ముస్లింల్లో  వెనుకుబాటు తనాన్ని రూపుమాపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేశారు. ఈ ప్రయోజనాల ద్వారా వేలాది ముస్లిం యువత ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కలిగింది.

ఇప్పుడు వైఎస్సార్‌ బాటలోనే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు పెద్దపీఠ వేశారు. ముఖ్యంగా ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు, స్కాలర్‌ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు పటిష్ట పరచడంతో పాటు ఆడపిల్ల పెళ్లికి వైఎస్సార్‌ పెళ్లి కానుక రూ.లక్ష, మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజన్లకు నెలకు రూ.15 వేలు గౌరవ వేతనం, ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ముస్లింలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని ప్రకటించారు. వక్ఫ్‌ బోర్డు, ఇతర సంస్థల స్థిర, చరాస్తుల రీ సర్వే, శాశ్వత పరిరక్షణకు చర్యలు, హాజ్‌ యాత్రికులకు ఆర్థిక సాయం, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం, ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానంగా 45 ఏళ్లకే పింఛన్‌ సౌకర్యం, వంటి అంశాలు ఆ వర్గాల వారికి ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నాయి.

సబ్‌ప్లాన్‌తో కష్టాలు తీరుతాయి 

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ముస్లింలకు సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని ప్రకటించడం అభినందనీయం. సబ్‌ప్లాన్‌ అమలు చేస్తే బడ్జెట్‌లో కేటాయించిన నిధులు వారికే వినియోగించేందుకు వీలుంటుంది. దీని వల్ల మైనార్టీల కష్టాలు తీరుతాయి. టీడీపీ ప్రభుత్వంలో వక్ఫ్‌ బోర్డు ఆస్తులు చాలా వరకూ ఆక్రమణలకు గురయ్యాయి. వాటిని పరిరక్షంచడంతో పాటు, మసీదుల్లో పని చేసే ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం అభినందనీయం. – సయ్యద్‌ ముజఫర్, వెంగళరావునగర్, నెల్లూరు

వైఎస్‌ చొరవతో ఉన్నత అవకాశాలు
ముస్లింలకు మహానుభావుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోనే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతున్నాం. మా కుటుంబాల్లో పేదలు విద్య, ఉద్యోగ అవకాశాలు సాధించగలుగుతున్నారు. ఇంజినీర్లు, ఇంజినీర్లు, డాక్టర్ల వంటి ఉన్నత చదువులు చదువు కలుగుతున్నారు. అప్పటి వరకు వెనుకబడి ఉన్న ముస్లింలలో వైఎస్సార్‌ రావడంతో ప్రగతి కనిపించింది. రాజకీయంగా ప్రాధాన్యత లభించింది. నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్‌ పదవి ముస్లింలకు దక్కిందంటే జగన్‌మోహన్‌రెడ్డి అందించిన చేయూతే.                        

– కుడుమూరు అబ్దుల్‌ అజీజ్, 
వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top