
సాక్షి, తిరుపతి : వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమరశంఖారావం సమావేశాలుంటాయిని ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమరశంఖారావం పేరుతో పార్టీ సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో పార్టీ సమావేశాలు ఉంటాయి. 4న తిరుపతి, 5న కడప, 6న అనంతపురంలో పార్టీ సమావేశాలుంటాయి. రాష్ట్ర ప్రజల అభ్యున్నతే వైఎస్ జగన్ లక్ష్యం. వైఎస్ జగన్ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. సొంతంగా ఒక్క పథకానికైనా చంద్రబాబు రూపకల్పన చేశారా? రాజధానిలో పర్మినెంట్ పేరుతో ఒక్క బిల్డింగ్ లేదు. అన్నీ తాత్కాలికమే.
చంద్రబాబు సుమారు రూ.6 లక్షల కోట్లు దోచుకున్నారు. ఎన్‌ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? కుట్రలో తన పాత్ర బయటపడుతుందనే బాబు భయపడుతున్నారు. రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వంగవీటి రంగాను హత్య చేయించింది ఎవరో ప్రజలందరికి తెలుసు. టీడీపీ ఓటమి ఖాయమని అన్నీ సర్వేల్లో వెల్లడైంది. ప్రజల మనోభావాలను బట్టి కేంద్రంలో పార్టీకి మద్దతిస్తాం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న పార్టీకే మా మద్దతు ఉంటుంది' అని తెలిపారు.