కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
హాలియా, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో హాలియాలో నిరసర ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం ఎనిమిదిసార్లు వంట గ్యాస్ ధరలను పెంచిందని విమర్శించారు.
భవిష్యత్‌లో వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం ముందుకు సాగుతుందన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ధర పెంచినా దాని భారం రాష్ట్ర ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ నాగార్జునసాగర్ నియోజకవర్గ కన్వీనర్ మల్లు రవిందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరి గిన కార్యక్రమంలో హాలియా, త్రిపురారం మండల శాఖ కన్వీనర్లు మల్లు అశోక్‌రెడ్డి, కందుకూరి అంజ య్య, రమావత్ జవహర్‌నాయక్, యువజన విభాగం నియోజకవర్గ నాయకుడు జానీ, కూన్‌రెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
గ్యాస్ భారంపై కన్నెర్ర
సాక్షి, నల్లగొండ: గ్యాస్ ధరల పెంపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నెర్ర జేశారు. గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండ, సూర్యాపేట, నకిరేకల్, హాలియా, యాదగిరిగుట్ట, మఠంపల్లి, కోదాడలలో ధర్నాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు చేశారు.