‘స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించండి’ 

YSRCP Asks To High court independent Investigation In The Attack On Ys jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో  హత్యాయత్నం ఘటనకు సంబంధించి విచారణను తక్షణమే ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ హైకోర్టును ఆశ్రయించింది. జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు చట్టపరమైన దర్యాప్తు చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి సోమవారం విచారణ జరపనున్నారు. 

ప్రాణాంతక దాడిని డీజీపీ పక్కదోవ పట్టించేలా మాట్లాడారు... 
‘ఈనెల 25న విశాఖ విమానాశ్రయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. వెంటనే ప్రతిస్పందించిన జగన్‌ తనను కాపాడుకునేందుకు మెడకు అడ్డుగా భుజాన్ని అడ్డు పెట్టడంతో లోతైన గాయమైంది. ఈ ఘటన తరువాత డీజీపీ విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ పబ్లిసిటీ కోసమే ఆ వ్యక్తి జగన్‌పై దాడి చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే ప్రతిపక్షనేతపై జరిగిన ప్రాణాంతక దాడిని పక్కదోవ పట్టించేలా మాట్లాడారు.  వచ్చే ఎన్నికల్లో సానుభూతి పొందాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్‌ సీపీ అంతర్గత ప్రణాళికలో భాగంగానే జగన్‌పై దాడి జరిగినట్లు ఆరోపణ చేశారు.

తద్వారా ఈ ఘటన దర్యాప్తును ఏ దిశగా తీసుకెళ్లాలో పోలీసులు ముందే నిర్ణయిం చేసుకున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుడిగా తేలినట్లు చెప్పారు. నిందితుడి ఇంట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫోటో కూడా ఉందని విలేకరుల సమావేశంలో చెప్పారు. జగన్‌పై ప్రాణాంతక దాడిని పలుచన చేసేలా సీఎం మాట్లాడారు. సీఎం, ఆయన సహచరులు రాజకీయ లబ్ధి కోసం దర్యాప్తును పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా దురుద్దేశాలతో ప్రకటనలు చేస్తున్నారు’అని సుబ్బారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  

దర్యాప్తు పక్షపాతంతో ఉంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు.. 
‘నిష్పాక్షిక విచారణ, పారదర్శక దర్యాప్తు కోరే హక్కు బాధితుడికి ఉంది. పక్షపాతానికి, దురుద్దేశాలకు తావు లేకుండా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. దర్యాప్తు పక్షపాతంతో సాగుతుంటే అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. సాక్ష్యాలను విస్మరించి, రకరకాల సిద్ధాంతాల ఆధారంగా దర్యాప్తును ముగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి పక్కా సాక్ష్యాలు ఉన్నా కూడా రాష్ట్ర దర్యాప్తు అధికారులు, ముందస్తుగా అనుకున్న దిశగానే సాగుతున్నారు. పోలీసు అధికారులు, ముఖ్యమంత్రి ప్రకటనలు దర్యాప్తు తీరుకు అద్దం పడుతున్నాయి.

పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. అందువల్ల జగన్‌పై జరిగిన హత్యాయత్న ఘట న దర్యాప్తు బాధ్యతలను వెంటనే ఓ స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలి’అని సుబ్బారెడ్డి తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ప్రతిపక్ష నేత జగన్‌పై ప్రాణాంతక దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రం లోని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, విమానయానశాఖ డీజీని ఆదేశించాలని కోరుతూ గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్, కడపకు చెందిన ఎం.అమర్‌నాథ్‌రెడ్డిలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top