గిరిజనానికి వరం

YSR Sampurna Poshan Scheme Will Be Implemented In Agency - Sakshi

ఏజెన్సీలో అమలుకానున్న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ పథకం 

ఇకపై గిరిపుత్రులకు మరింత మెరుగైన పౌష్టికాహారం  

25 వేలమంది లబ్ధిదారులకు ప్రయోజనం

సీతంపేట: ఏజెన్సీలో ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇక అదనపు పోషకాహారం అందనుంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ అభియాన్‌ పథకాన్ని ఎనిమిది జిల్లాల్లో అమలు చేసేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో భాగంగా మరికొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభ య గోదావరి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

జిల్లాలో అమలు ఇలా.. 
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఐటీడీఏ పరిధిలోని 20 సబ్‌ప్లాన్‌ మండలాల పరిధిలో 1250 గిరిజన గ్రామాలున్నాయి. జిల్లాలో 18 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 4,192 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, ఏజెన్సీలో 825 కేంద్రాలున్నాయి. వీటిలో 422 మెయిన్, 403 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఏడు నెలల నుంచి ఆరేళ్ల లోపు సుమారు 17939 ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏజెన్సీలో గర్భిణులు, బాలింతలు,  చిన్నారులంతా కలిపి సుమారు 25వేల మంది లబ్ధిదారులున్నట్టు గుర్తించారు.  జిల్లాలో  11 శాతం కంటే తక్కువ రక్తహీనత గల గర్భణులు సుమారు 9 వేలు, మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు లోపు పోషణకు గురైన చిన్నారులు–1549మంది, 7 నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు–1624 గురైనట్టు గతంలో గుర్తించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌  పథకం ద్వారా వారందరికీ అదనంగా పోషకాహారం అందించనున్నారు.

పూర్తిస్థాయిలో లబ్ధిదారులందరికీ పోషకాహారం అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్‌ నుంచి కొత్త మెనూ అంగన్‌వాడీ కేంద్రాలకు అమలు చేయనున్నారు. ఈ పథకంలో ఆరు నెలల నుంచి 3 ఏళ్ల చిన్నారులకు నెలకు రూ.600లతో ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు, వంద గ్రాముల బాలామృతాన్ని అందజేస్తారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు నెలకు 25 రోజులపాటు కోడిగుడ్డుతో పాటు అన్నం, ఆకుకూరలు, పప్పుతో భోజనం, పాయసం, లడ్డు, బిస్కెట్లు ఇస్తారు.  గర్భిణులు, బాలింతలకు గుడ్డు, పాలు, ప్రోటీన్లతో కూడిన భోజనాన్ని అందించనున్నారు. 

విధి విధానాలు రావాల్సి ఉంది.. 
ఈ పథకానికి సంబంధించి విది విధానాలు రావాల్సి ఉంది. దీంతో అమలు ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోషకాహారం అందజేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారం సక్రమంగా పోషకాహారాన్ని ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తాం. 
– పి.రంగలక్ష్మి, సీడీపీఓ, సీతంపేట

పక్కాగా అమలు చేయాలి..
ఏజెన్సీలోని 8 జిల్లాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ అభియాన్‌ పక్కాగా అమలు చేయాల్సిందే. ఎక్కడ ఎటువంటి లోపాలు ఉండకుండా చూడాల్సిన అవసరం సంబంధిత అధికారులపై ఉంది. గిరిజన ప్రాంతాల్లో ఈ తరహా పథకాలను అమలు చేసినందుకు  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మా గిరిజనుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.  
–విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top