సంక్రాంతి భరోసా! 

YSR Rythu Bharosa Financial Assistance To Farmers - Sakshi

జిల్లాలో 3,35,218 మందికి తుదివిడత వైఎస్సార్‌ రైతు భరోసా 

గ్రామ సచివాలయాల్లో నేటి నుంచి జాబితాల ప్రదర్శన 

తోడుగా ఉన్నానంటూ రైతులకు సీఎం జగన్‌ లేఖ 

సాక్షి, విశాఖపట్నం: అన్నదాతలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన డాక్టర్‌ వైఎస్సార్‌ రైతుభరోసా పథకంలో తుది విడత (సంక్రాంతి) చెల్లింపుల ప్రక్రియ మొదలైంది. ఇందుకు అవసరమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తద్వారా జిల్లాలో 3,35,218 మంది రైతు కుటుంబాలకు మేలు జరగనుంది. లబ్ధిదారుల జాబితాను బుధవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. శనివారం నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున నేరుగా జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.  

జిల్లాలో 5,72,674 భూమి ఖాతాలు ఉన్నాయి. వీటిలో కొంతమంది రైతులకు రెండు మూడు ఖాతాలు ఉన్నాయి. అలాగాకుండా ప్రతి రైతు కుటుంబంలో ఒక ఖాతా చొప్పున పీఎం కిసాన్‌–డాక్టర్‌ వైఎస్సార్‌ రైతుభరోసా పథకానికి వ్యవసాయ శాఖ ఎంపిక చేసింది. తుదకు 3,55,478 ఖాతాలను ఎంపిక చేశారు. కొన్ని ఖాతాల్లో సాంకేతిక కారణాల వల్ల జమ ఆగిపోయిన నేపథ్యంలో పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ తొలి రెండు విడతల్లో 3,33,953 ఖాతాలకు సంబంధించి రైతులకు రూ.270 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఇక సంక్రాంతి కానుకగా తుది విడత రూ.2 వేలు చొప్పున ప్రభుత్వం జమచేయనుంది. సాంకేతిక కారణాలతో ఆగిన ఖాతాలను పరిష్కరించిన తర్వాత తుదకు 3,35,218 రైతు కుటుంబాలకు ఈసారి లబ్ధి కలగనుంది.

ఈ సీజన్‌లో తుదివిడత.. 
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల్లో వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ప్రధానమైంది. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో 50 వేల రూపాయలు ప్రతి రైతుకూ సాయం చేస్తానని ఆయన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ కన్నా రూ.వెయ్యి అదనంగా పెంచి పీఎం కిసాన్‌–డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు దఫాల్లో రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.67,500 మేర భరోసా అందనుంది. ఈ సీజన్‌లో తుదివిడత అర్హుల జాబితాలను బుధవారం ఆయా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆయా రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖలను అధికారులు అందించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top