
ప్రజా పక్షాన పోరాటం
రుణమాఫీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ వద్ద శుక్రవారం మహాధర్నా చేపట్టనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
విజయనగరం మున్సిపాలిటీ :రుణమాఫీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ వద్ద శుక్రవారం మహాధర్నా చేపట్టనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ ధర్నాలో జిల్లావ్యాప్తంగా 10 వేల మంది పాల్గొనున్నట్టు చెప్పారు. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న మహిళలు, రైతన్నలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ ప్రజా పక్షాన పోరాటం చేస్తుందన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజుతో కలిసి కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో ధర్నాకు సంబంధించి స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించి, అధికారం చేజి క్కించుకున్న టీడీపీ నాయకులు అనంతరం ప్రజలను మోసం చేస్తూ.. మాయ మాటలు చెబుతూ.. ప్రలోభాలకు గుర్తి చేస్తున్నారని మండి పడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాం డ్ చేస్తూ ఇప్పటికీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు ధర్నాలు, నిరసనలు చేపట్టినట్టు తెలిపారు. ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పందించకున్నా...ప్రజలు మరిచిపోయినా.. ప్రతిపక్ష పార్టీగా వాటిని అమలు చేసేందుకు ఒత్తిడి తెస్తామన్నారు. తమ పార్టీ నేత మహాధర్నా ప్రకటించిన అనంతరం ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన నగదు గురువారం బ్యాంకుల్లో వేస్తామని ప్రకటించడం విడ్డూ రంగా ఉందన్నారు. గత ఆరు నెలలుగా చెప్పిన మాటలే చెప్పి ప్రజలను విసిగిస్తున్న ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు టీడీపీ ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ కేవలం రుణమాఫీపైనే ఈ ధర్నా జరుగుతుందన్నారు.
కేవలం విదేశీ పర్యట నలు, ప్రజలను మోసపరిచే ప్రకటనలు మినహా ఈ ప్రభుత్వం చేస్తుందేమీ లేదన్నారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ ప్రభుత్వ మోసపూరిత హా మీలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడో నిరసనలు చేపట్టాలని తలపెట్టినప్పటికీ.. ప్రభుత్వం ఆరు నెలల పాలనలో ప్రజలకు ఏమీ చేయలేకపోయిందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, చనుమళ్ల వెంకటరమణ, సింగుబాబు, పీరుబండి.జైహింద్‌కుమా ర్, పతివాడ అప్పలనాయుడు, కౌన్సిలర్లు ఎస్‌వీవీ రాజేష్, కేధారశెట్టి సీతారామమూర్తి, బొద్దాన అప్పారావు, నడిపేన శ్రీనివాసరావు, ఎన్. బంగారునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
శాంతియుతంగా ధర్నా
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన మహాధర్నా వల్ల ప్రయాణికులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోలగట్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ధర్నాలో వేలాది మంది ప్రజలు పాల్గొనున్న నేపథ్యంలో ప్రాంతాల వారీగా ప్రత్యేక స్థలాలు కేటా యించారు.
పార్వతీపురం డివిజన్ నుంచి వచ్చిన వారు కలెక్టరేట్‌కు సమీపంలో గజపతినగరం రోడ్డులోని కేతలవారి పెట్రోల్ బంక్ పక్క స్థలంలో వేచి ఉండేలా ఏర్పాటు చేశారు. అలాగే ఎస్. కోట, గంట్యాడ నుంచి వచ్చేవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన గల ఖాళీ స్థలం లోనూ, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల నుంచి వచ్చే వారు పోలీస్ బ్యారక్స్ పక్కన గల ఖాళీ స్థలంలోనూ వేచి ఉండేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయనగరం పట్టణం, మండలం నుంచి వచ్చే వారు కంటోన్మెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎదురుగా, నెల్లి మర్ల, చీపురుపల్లి, గుర్ల ప్రాంతాల నుంచి వచ్చే వారు గంజిపేట వద్ద గల గణేష్ కోవెల వద్ద వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాం తాల నుంచి కేటాయించిన వేదికలు వద్దకు ప్రజలు చేరుకున్న అనంతరం ధర్నా చేస్తారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తారు.