తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లాల్‌జాన్ భాషా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లాల్‌జాన్ భాషా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మైనార్టీలకు లాల్‌జాన్ భాషా అంకిత భావంతో సేవలందించారని కొనియాడారు. ఎంపీగా ఆయన పలు సమస్యలపై స్పందించి ప్రజాహిత రాజకీయాల్లో కొనసాగారని విజయమ్మ తెలిపారు. నిరాడంబరుడు, సౌమ్యుడైన లాల్‌జాన్ భాషా ప్రమాదంలో మరణించడం మనసును కలచి వేసిందన్నారు.
నార్కెట్పల్లి సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లాల్జాన్బాషా మృతి చెందిన విషయం సంగతి తెలిసిందే. నల్గొండ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు డీవైడర్ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.