మెరుపు వేగం.. వైఎస్‌ సొంతం

YS Rajasekhara Reddy takes decisions at lightning speed for people welfare - Sakshi

ప్రజాహితం కోసం పరుగెత్తిన ఫైళ్లు

వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. ఆ పేరు వింటేనే ప్రజల్లో అదో జోష్‌. ఆయన పనితీరూ అంతే! వేగం..ప్రజాహితం అనుకుంటే చాలు మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే సొంతం.ఈ క్షణం చేజారితే ఈ సందర్భం మళ్లీ రాదేమో.. అన్నంత శీఘ్రంగా ఆయన పాలనలో ఫైళ్లు పరుగెత్తేవి. ఒక్కసారి మదిలోకి వస్తే చాలు ఆ పనికి ఎంత ఖర్చవుతుంది? ఎలాంటి క్లిష్టమైన అడ్డంకులున్నాయి? అనుమతులున్నాయా లేదా..? అని కూడా చూడరు.ప్రజలకు మేలు జరిగేదేదైనా వెంటనే అమలుచేయాలన్న లక్ష్యమే ఆయనకు కనిపిస్తుంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల కాలంలో జనహితం కోసం తీసుకున్న నిర్ణయాలవల్ల అనేక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు అమలులోకి వచ్చాయి. వాటిలో మచ్చుకు కొన్ని..     
–సాక్షి, అమరావతి

సంతృప్త స్థాయిలో అందరికీ అన్నీ.. 
ఎన్నికలపుడే రాజకీయాలు.. ఆ తర్వాత అందరూ ఒకటే.. సంక్షేమ పథకాలు లబ్ధిపొందడానికి అర్హత ఉండాలి కానీ రాజకీయాలు కావని ఎప్పుడూ చెప్పే వైఎస్‌ సంతృప్త స్థాయిలో (అర్హులైన వారందరికీ) పథకాల లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో వైఎస్‌తో కలిసి అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొని కారులో తిరిగి వస్తూ.. ‘ఎక్కడకు వెళ్లినా సంచుల కొద్దీ దరఖాస్తులు వస్తున్నాయి? ఏం చేద్దాం అన్నా..’ అని ప్రశ్నించారట. ‘రేషన్‌కార్డులు, ఇళ్లు, పింఛన్లు అర్షులందరికీ ఇచ్చేస్తే ఈ అర్జీలకు ముగింపు పలకొచ్చు’ అన్నారట. వెనువెంటనే ఆ మేరకు సంతృప్త స్థాయిలో అందరికీ పథకాలు ఇవ్వాలనే విధానానికి వైఎస్‌ రూపకల్పన చేశారు.  

ఎల్లంపల్లి ప్రాజెక్టు 
ఓ సారి అప్పటి భారీ సాగునీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య , వైఎస్‌ వద్దకు వెళ్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే దానివల్ల కలిగే ఉపయోగాన్ని వివరించారు. వెనుకా ముందు చూడకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపనకు తేదీని ఖరారు చేయండి.. డీపీఆర్‌ సంగతి తర్వాత చూసుకుందామని వైఎస్‌ జవాబిచ్చారు. అంతేకాదు, ప్రాజెక్టు శంకుస్థాపనకు వెళ్లినపుడు నీటి స్టోరేజి కోసం మరో ఐదారడుగులు డ్యాం ఎత్తు పెంచితే బాగుంటుందని ఇంజినీర్లు చెప్పడంతో అక్కడికక్కడే ఒక నిర్ణయం తీసుకుని పెంపునకు ఆదేశాలిచ్చారు. ఈ రెండు నిర్ణయాలూ జలయజ్ఞంలో మైలు రాళ్లుగా మిగులుతాయి. 

భూపాలపల్లి విద్యుత్‌ ప్రాజెక్టు 
ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు నీళ్లు, బొగ్గు తరలించుకుపోతున్నారని, తెలంగాణలోనే విద్యుత్‌ ఉత్పాదన ప్లాంటును నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నాటి మంత్రి పొన్నాల, వైఎస్‌ దృష్టికి మరో సందర్భంలో తీసుకువెళ్లారు. వెంటనే 500 మెగావాట్ల ప్రాజెక్టును నిర్మించడానికి వైఎస్‌ అంగీకారం తెలిపి శంకుస్థాపనకు సిద్ధమయ్యారు. అందుకు వైఎస్‌తో పాటుగా పొన్నాల వెళ్తుండగా.. హెలికాప్టర్‌ నుంచి కిందికి చూపుతూ.. బొగ్గు, నీటి లభ్యత ఉంది కాబట్టి మరో 600 మెగావాట్ల ప్రాజెక్టు కూడా ఏర్పాటుచేస్తే బావుంటుందని సూచించారు. సభలోకి వైఎస్‌ వెళ్లగానే ఈ మేరకు ప్రకటన చేశారు. 

చిన్నారులకు గుండె ఆపరేషన్లు 
చిన్నారులకు ప్రభుత్వ నిధులతోనే గుండె ఆపరేషన్లు చేయించాలన్నది వైఎస్‌ తీసుకున్న నిర్ణయాల్లో అమోఘమైనది. రెండేళ్లలోపు చిన్నారుల గుండెలకు రంధ్రాలు పడి మరణిస్తున్నారని, ఆ పిల్లల తల్లిదండ్రులకు చికిత్స చేయించుకునే స్తోమత లేకపోవడమే ప్రధాన కారణమని వైఎస్‌ దృష్టికి వచ్చినప్పుడు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని ఉచితంగా ఆపరేషన్లు చేయించే పథకాన్ని అమలులోకి తెచ్చారు. 

కిలో రూ.2కే బియ్యం పథకం 
కిలో బియ్యం రూ.2కే అందజేయాలనే నిర్ణయం కూడా అప్పటికప్పుడు తీసుకున్నదే. ఈ అంశంపై అధికారుల సమీక్షా సమావేశంలో వారు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. మరో రెండు రోజులు ఆగి క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుందామని అన్నారు. ‘రెండు రోజులాగితే నా మనసు మార్చవచ్చని మీరనుకుంటున్నట్లుంది’ అని వైఎస్‌ అధికారులను తోసి రాజని అప్పటికపుడు టీవీలకు, పత్రికలకు ఈ నిర్ణయం వెల్లడించాల్సిందిగా ఆదేశించారు.  

రూ.50 గ్యాస్‌ సబ్సిడీ 
గుంటూరు పర్యటనలో వైఎస్‌ ఉండగా ఓసారి కేంద్రం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచినట్లు వార్త వెలువడింది. ఈ భారం సబబు కాదని గృహిణులకు వెసులుబాటును ఇవ్వాలనే ఉద్దేశంతో, ఏ మేరకు భారం పడుతుందో.. అప్పటికపుడు లెక్కలను రూపొందించాలని అధికారులను కోరారు. గంట వ్యవధిలో సమాచారాన్ని తెప్పించుకుని రూ.50 సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అక్కడే బహిరంగ సభలో ప్రకటించి వెనుదిరిగారు. 

మన్నవరం ప్రాజెక్టుపై ఏకంగా ప్రధానితోనే.. 
చిత్తూరు జిల్లా మన్నవరం విద్యుత్‌ పరికరాల ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో మూడు రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడింది. దీనిపై వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసాధారణ రీతిలో నేరుగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి మన రాష్ట్రానికి వచ్చేలా చేశారు. వైఎస్‌ మన్నవరం కోసం ప్రధానితో నేరుగా ప్రాజెక్టు కావాలంటూ వాదనకు దిగి సాధించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 

ప్రతిష్టాత్మకమైన బిట్స్‌ పిలానీ.. 
బిట్స్‌ పిలానీ క్యాంపస్‌ హైదరాబాద్‌కు వచ్చిందంటే అది కేవలం వైఎస్‌ తీసుకున్న మెరుపు నిర్ణయమేనన్నది నిర్వివాదాంశం. బిట్స్‌ (పిలానీ), బిట్స్‌ (గోవా) క్యాంపస్‌లతో పాటు దక్షిణాదిలో కూడా విస్తరించాలని బిట్స్‌ పాలకవర్గం భావిస్తున్న విషయాన్ని తెలుసుకున్న వైఎస్‌.. వెంటనే వారికి లేఖ రాసి ‘మీకు ఏం కావాలంటే అది ఇస్తాం. ఎలాంటి రాయితీకైనా సిద్ధం’ అని తెలిపారు. దీంతో వారు అందుకు సమ్మతించి హైదరాబాద్‌ క్యాంపస్‌ను మంజూరు చేశారు. శామీర్‌పేట్‌ వద్ద వైఎస్‌ 250 ఎకరాల స్థలాన్ని కేటాయించడమేకాక, రోడ్డు, విద్యుత్, మంచినీరు వంటి సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన కల్పించేలా శ్రద్ధ తీసుకున్నారు. ప్రారంభోత్సవానికి వైఎస్‌ వెళ్లినపుడు అక్కడికక్కడే ల్యాండ్‌ కన్వర్షన్‌ చార్జీలను కూడా రద్దుచేశారు.   

అమెరికన్‌ కాన్సులేట్‌ నడిచొచ్చింది 
దక్షిణాదిలో చెన్నైకు తోడు మరోచోట అమెరికన్‌ కాన్సులేట్‌ను ఏర్పాటుచేయాలని అమెరికా సంకల్పించి అందుకు బెంగళూరు నగరాన్ని ఎంపిక చేసుకుంది. ఇక ప్రారంభించడమే తరువాయి అనుకున్న తరుణంలో.. హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ హాష్మీ, అంతర్జాతీయ వ్యాపారవేత్త లుత్వీ హసన్, వైఎస్‌ను కలిసి తమకో అవకాశం ఇస్తే బెంగళూరుకు బదులుగా హైదరాబాద్‌కు కాన్సులేట్‌ను తేగలమన్నారు. ఇదివరకే నిర్ణయం అయిన దాన్ని మీరెలా మార్చగలుగుతారు? అందులోనూ అమెరికా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన జరుగుతుందా? అని వైఎస్‌ అనుమానం వ్యక్తంచేస్తూనే.. ‘అయినా ప్రయత్నించండి, వారికి (యూఎస్‌కు) ఏం కావాలంటే మనం ఆ సౌకర్యాలను కల్పిద్దాం’ అని వారితో అన్నారు. వారు రంగంలోకి దిగి బెంగళూరుకు ఖరారైందనుకున్న కాన్సులేట్‌ను హైదరాబాద్‌కు తెచ్చారు. యూఎస్‌ అధికారులు ఎంపిక చేసుకున్న ‘పైగా’ ప్యాలెస్‌లోని హుడా కార్యాలయాన్ని ఖాళీ చేయించి వారికిచ్చారు.  

తొలి సంతకానికి తోడు బకాయిలూ రద్దు 
2004లో అధికారం చేపట్టిన వైఎస్‌.. తన తొలి సంతకంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అమలులోకి తెచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, అప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు రూ.1,250 కోట్ల వరకూ ఉన్నాయి. ముఖ్యమంత్రి కాగానే ఏర్పాటైన తొలి విలేకరుల సమావేశంలో ఎవరూ ఊహించని రీతిలో రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడమే కాదు, ఈ రోజు వరకూ ఉన్న వారి విద్యుత్‌ బకాయీలన్నింటినీ కూడా మాఫీ చేస్తున్నానని ప్రకటించారు. దీంతో అప్పటివరకూ బకాయిల కారణంగా తొలగించిన లక్షలాది వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్‌లను పునరుద్ధరించారు.  

గెయిల్‌ను ఒప్పించి.. గ్యాస్‌ను రప్పించి.. 
గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌) గ్యాస్‌ ఇస్తుందని చెప్పి 2,700 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ ఉత్పాదనా ప్రాజెక్టులకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2004కు ముందు అనుమతిచ్చింది. తీరా గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, గెయిల్‌ గ్యాస్‌ సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. తమ ప్రాజెక్టులకు గ్యాస్‌ సరఫరా చేయలేకపోయినా ప్రైవేటు ఉత్పత్తిదారులకు ఏటా రూ.1,200కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ప్రజలపై పెనుభారంగా పరిణమించినపుడు వైఎస్‌ తాను అధికారంలోకి వచ్చాక గెయిల్‌తో చర్చలు జరిపి గ్యాస్‌ కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎరువుల ఫ్యాక్టరీలకు తాము తొలి ప్రాధాన్యంగా గ్యాస్‌ సరఫరా చేస్తున్నాం కనుక విద్యుత్‌ ప్రాజెక్టులకు ఇవ్వలేమని గెయిల్‌ అధికారులు చెప్పారు. అయితే, ఎరువుల ఫ్యాక్టరీలు ఓవర్‌ హాలింగ్‌ కోసం ఏడాదిలో ఒక నెల రోజులపాటు ఉత్పత్తిని నిలిపివేస్తాయి కనుక ఆ సమయంలో వారికి సరఫరా చేయని గ్యాస్‌ను తమ రాష్ట్రంలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు ఇవ్వాల్సిందిగా వైఎస్‌ కోరారు. రూ.1,200 కోట్ల భారాన్ని ప్రజలపై పడకుండా చేశారు.  

కార్మిక సంక్షేమం కోసం..
వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన కొత్తలో మున్సిపల్‌ కార్మికులకు జీతాలు పెంచాలనే ప్రతిపాదన వచ్చినపుడు ఉన్నతాధికారులు ఈ అంశంపై ఓ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇదంతా ఎందుకు? ‘మున్సిపల్‌ కార్మికులకు జీతాలు పెంచడానికి ఇన్ని లెక్కలా! వచ్చే నెల నుంచి వారి జీతాలు పెంచండి! అంతే’ అని నిర్ణయాన్ని ప్రకటించి నిష్క్రమించారు.  

హైదరాబాద్‌ శివారులో పేదలకు గృహాలు
నగరంలో నివసించే పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదని, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ ఇద్దరూ కలిసి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వారికి అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రశాంతంగా ఆలకించిన వైఎస్‌ పెద్దగా స్పందించలేదు. కానీ ఆ మరుసటి రోజే రాజీవ్‌ గృహకల్ప కాలనీలకు అంకురార్పణ చేశారు.  

వైఎస్‌ వల్లే ఐసీఐసీఐ హబ్‌ సాకారం 
ఐసీఐసీఐ ప్రతినిధులు ప్రాంతీయ హబ్‌ ఏర్పాటుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నట్లు వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టికి రాగానే ఆయన వెంటనే స్పందించి.. ‘వాళ్లను రాష్ట్రానికి ఆహ్వానించండి.. మన దగ్గర హబ్‌ పెట్టేలా చూడండి. వారికేం సౌకర్యాలు, రాయితీలు కావాలో మనమిద్దాం’ అని అధికారులను ఆదేశించారు. దాని ఫలితంగానే నేడు అక్కడ 22వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేసేంత నలభై లక్షల చదరపు అడుగుల సామర్ధ్యంగల అతిభారీ ఆవరణ ఏర్పడింది. ఐసీఐసీఐ ఇక్కడి నుంచే తన వ్యాపార లావాదేవీలన్నీ పర్యవేక్షిస్తోంది.  

సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తరచూ జరుగుతున్న తరుణంలోనే.. రైతులు,డ్వాక్రా మహిళలకు ఇస్తున్న తరహాలో చేనేత కుటుంబాలకు కూడా పావలా వడ్డీ వర్తింపజేయడంతో పాటు, రూ.5 లక్షల చొప్పున రుణాలను ఇస్తే బాగుంటుందన్న ఓ మంత్రి సూచనపై మరుసటి రోజే ప్రతిపాదనలు తెప్పించుకున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top