అభివృద్ధే వైఎస్సార్‌ పంథా | YS Rajasekhara Reddy Jayanti special story | Sakshi
Sakshi News home page

అభివృద్ధే వైఎస్సార్‌ పంథా

Jul 8 2018 8:39 AM | Updated on Jul 8 2018 8:39 AM

YS Rajasekhara Reddy Jayanti special story - Sakshi

పోలవరం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో మంజూరైన వివిధ పథకాలు జిల్లాలో ఒక్కొక్కటిగా నేడు అక్కరకు వస్తున్నాయి. ఆ పథకాలే ఇప్పుడు ప్రజలకు ప్రధానమైన సాగునీటి అవసరాలను తీర్చటంతో పాటు, అనేక గ్రామాలకు, పంటచేలకు రక్షణగా నిలిచాయి. ప్రధానంగా దశాబ్దాల కాలంగా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని పశ్చిమ ఏజెన్సీలో కూడా అభివృద్ధిని పరిచయం చేసిన ఘనత వైఎస్సార్‌దే. ఒక్క ఏజెన్సీ ప్రాంతంలోనే  కాక, దేశంలోనే పెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయటంతో పాటు, అవసరమైన అనుమతులు కూడా తీసుకువచ్చారు. సాహసోపేతంగా పనులు ప్రారంభించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2004లో అప్పటి రూ.10,151 కోట్ల అంచనాతో శంకుస్థాపన చేశారు. నిర్వాసితుల ఆందోళనల మధ్య హెడ్‌వర్క్స్‌ పనులు ప్రారంభించారు. అలాగే కుడి, ఎడమ ప్రధాన కాలువల తవ్వకాలను ప్యాకేజ్‌లుగా విభజించి తవ్వకాలు వేగవంతం చేశారు. ఆయన హయాంలోనే కాలువల పనులు దాదాపు 40 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయి. వేగంగా జరిగే పోలవరం పనులు వైఎస్సార్‌ మరణానంతరం ఒక్కసారిగా పడకేశాయి. 

 కొవ్వాడ కాలువకు అడ్డుకట్ట 
అలాగే పోలవరం మండలంలోని పట్టిసీమ వద్ద కొవ్వాడ కాలువ ఉద్ధృతికి ఆ ప్రాంత రైతాంగం జీవన స్థితిగతులు దిగజారిపోయాయి. ఏటా వర్షాకాలంలో దాదాపు 10 వేల ఎకరాల్లోని పంట ముంపునకు గురయ్యేది. ఈ పొలాలతో పాటు పరిసర గ్రామాలు మంపునకు గురయ్యేవి. వైఎస్సార్‌ పాదయాత్రలో ఉన్న సందర్భంలో రైతులు కలసి తమ సమస్యలు వివరించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మర్చిపోకుండా 2008లో రూ.58 కోట్ల అంచనాలతో కొవ్వాడ కాలువపై అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ నిర్మాణాన్ని మంజూరు చేశారు. ఈ పథకం పూర్తికావటంతో కొవ్వాడ ముంపు ముప్పు రైతులకు తప్పింది. పంటలు, గ్రామాలకు రక్షణ ఏర్పడింది. రైతుల జీవన స్థితిగతులు పూర్తిగా మెరుగుపడ్డాయి.  అలాగే ఏటా గోదావరి వరదల కారణంగా పోలవరం గ్రామం ముంపునకు గురయ్యేది. వేలాది కుటుంబాలు నిరాశ్రయులవ్వటంతో పాటు, రూ.కోట్ల విలువైన సంపద కోల్పోయేవారు. దీంతో  ప్రజల విజ్ఞప్తి మేరకు పోలవరంలోని యడ్లగూడెం నుంచి పాత పోలవరం వరకు 3.1 కి.మీ. లంక పొడవునా నెక్లెస్‌బండ్‌ నిర్మాణాన్ని రూ.3.75 కోట్లతో వైఎస్సార్‌ 2008లో మంజూరు చేశారు. ప్రస్తుతం బండ్‌ నిర్మాణం పూర్తికావొచ్చింది. ప్రజలకు, ఆస్తులకు రక్షణ కలిగింది.

 పోగొండతో జలకళ 
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన, గిరిజనేతరుల భూములకు సాగునీటి వసతి కల్పించిన ఘనత కూడా వైఎస్సార్‌దే.  బుట్టాయిగూడెం మండలంలోని పోగొండ రిజర్వాయర్‌ను 2008లో రూ.26 కోట్ల అంచనాలతో వైఎస్సార్‌ మంజూరు చేశారు. 4 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈపథకం మంజూరు చేశారు. ఇప్పుడది పూర్తయ్యింది. కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లోని దాదాపు 7.5 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.    
 

Advertisement
 
Advertisement
Advertisement