వైఎస్సార్‌ను స్మరించుకున్న ఆయన సంక్షేమ పథకాల లబ్దిదారులు
ఈ ఆయుష్షు ఆయన ఇచ్చిందేనని, పిల్లలు ప్రయోజకులయ్యారంటూ భావోద్వేగం
వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
గచ్చిబౌలి: తెలుగు నేలపై చెరగని సంతకం వైఎస్సార్.. ఆయన మళ్లీ పుట్టాలి..పాలన చేయాలి.. నేను బతికి ఉన్నానంటే ఆయనే కారణం..వైఎస్సార్ వల్లే మా ముగ్గురు పిల్లలు ప్రయోజకులయ్యారు..ఆయన ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు..ఇలా ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ఎంతోమంది బరువెక్కిన హృదయాలతో వెల్లడించిన అభి ప్రాయాలివి. బుధవారం మాదాపూర్‌లోని బుట్టా కన్వెన్షన్‌లో వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ సంక్షేమ పథకాల లబ్దిదారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు.

ఇంట్లో ఎవరూ అన్నం ముట్టలేదు: గోరటి వెంకన్న
తెలుగు నేలపై చెరగని సంతకం వైఎస్సార్ అని ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటి వెంకన్న పేర్కొన్నారు. వైఎస్సార్ మరణ వార్త విని తమ ఇంట్లో పిల్లలు సహా ఎవరూ అన్నం ముట్టలేదని ఆయన తెలిపారు. వైఎస్సార్‌తో మరిచిపోలేని అనుబంధం ఉందని చెప్పారు. కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలతో వైఎస్సార్ పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..’అనే పాట ఇచ్చినందుకు వైఎస్సార్ తనను ఎంతో ఆప్యాయంగా పలుకరించేవారని తెలిపారు. ఎంపీగా అవకాశం ఇస్తానంటే నిరాకరించగా, కళారత్న అవార్డు ఇచ్చి గౌరవించారని చెప్పారు.
మహారుషి, యోధుడు: వరప్రసాద్‌రెడ్డి
శాంతా బయోటెక్ చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘50 ఏళ్లకు ఓ పుణ్య పురుషుడు రావాలి. వైఎస్సార్ మళ్లీ పుట్టి పరిపాలన చేయాలి. ఆయన కాఠిన్యం, కారుణ్యం ఉన్న గొప్ప నాయకుడు. మహారుషి లాంటి మనిషి, మహా యోధుడు. ప్రజలే ప్రధానం అనే వైఎస్సార్ లాంటి వ్యక్తి దేశానికి అవసరం’అని అన్నారు. ‘రాజకీయం అంటే కరుడుగట్టిన ద్వేషం, భాష వాడితే తప్ప రాజకీయ నాయకులం అనుపించుకోలేం..’అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల గురించే ఆలోచించేవారు: భాస్కరశర్మ
వైఎస్సార్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి భా స్కరశర్మ మాట్లాడుతూ.. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్‌తో 17 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆయనతో కలిసి రోజుకు 14 గంటలు పని చేసే వాడినని గుర్తు చేశారు. పేదలకు విద్య, ఆరోగ్యం అందించేందుకు వైఎస్ ఎంతగానో ఆలోచించే వారని చెప్పారు. తనకు ఎవరూ బొకేలు, శాలువాలు ఇవ్వవద్దని, తోచినంత సీఎంఆర్‌ఎఫ్‌కు ఇవ్వాలని చెప్పిన గొప్ప మనస్తత్వమని కొనియాడారు. సహాయం కోసం వార్డు మెంబర్, సర్పంచ్ వచ్చినా కాదనేవారు కాదన్నారు. ప్రేమ విఫలం కావడంతో ఓ యువతి హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే లేక్ పోలీసులు కాపాడగా, ఆ యువతికి కౌన్సెలింగ్ చేసిన మానవతావాది వైఎస్సార్ అని, ఆయన్ను మళ్లీ చూడలేమంటూ భావోద్వేగానికి గురయ్యారు.
సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం: వైఈపీ
వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించేవారని గుర్తుచేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, జలయజ్ఞం లాంటి సంక్షేమ పథకాలు చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చక్రపాణిరెడ్డి, హఫీజ్‌ఖాన్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకర్, కారుమూరి వెంకట్‌రెడ్డి, శ్యామలారెడ్డి, వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సభ్యులు ఏపీ రెడ్డి, మల్లు సురేందర్‌రెడ్డి, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.
నా ముగ్గురు కొడుకులు ప్రయోజకులయ్యారు
నేను ఓ చిన్న జ్యువెలరీ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్న సమయంలో నా కొడుకులను ఉన్నత చదువులు చదివించడం కష్టమయ్యింది. ఆ సమయంలోనే వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు. దాంతో నా ముగ్గురు కొడుకులు బీటెక్ చదవడమే కాకుండా జీవితంలో స్థిరపడ్డారు. – మహ్మద్ జమీల్ అస్గర్, కాకినాడ
సీసీ టీవీలో చూసి.. పిలిపించి పునర్జన్మ
నా కూతురు గుండెకు రంధ్రం ఉందని, ఆపరేషన్‌కు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఓ రోజు వైఎస్సార్ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లగా సెక్యూరిటీ వాళ్లు అడ్డుకున్నారు. అయితే సీసీ కెమెరాలో చూసిన వైఎస్సార్ లోపలికి పిలిచి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే కామినేని ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి రూపాయి ఖర్చు లేకుండా సర్జరీ చేయించారు. నా కూతురు అలేఖ్య ఇప్పుడు బీటెక్ చదువుతోంది. – చల్లా సుశీల, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా
రాజకీయాలంటే వైఎస్సార్‌కు ముందు తర్వాత..
రాజకీయాలంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ముందు, తర్వాత అని చెప్పుకోవాలి. పార్టీలు, తారతమ్యాలు చూడకుండా చేయూతనిచ్చిన మహనీయుడు. గుండె పోటు, క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చాయంటే ఇక చావే శరణ్యమని పేదలు నిర్ణయించుకునేవారు. కానీ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఎందరి ప్రాణాలనో నిలిపింది. ఆరోగ్యశ్రీ ద్వారా నా తమ్ముడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. – కూర్మారావు, శ్రీకాకుళం
ఈ జీవితం వైఎస్సార్ చలువే..
ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌కు శస్త్ర చికిత్స చేసి 15 సంవత్సరాలు బతుకుతావని డాక్టర్లు చెప్పారు. కానీ ఇప్పటికి 17 ఏళ్లు. అయినా బతికి ఉన్నానంటే వైఎస్సార్ చలువే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజినీరింగ్, సీఏ చదివిన నా ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు సంపాదించారు. మేం ఎప్పటికీ వైఎస్సార్ కుంటుంబంతోనే ఉంటాం. – దాసరి రాము, వైజాగ్
ఈ ప్రాణం వైఎస్సార్ ఇచ్చిందే..
నేను బతికి ఉన్నానంటే కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఈ ప్రాణం వైఎస్సార్ ఇచ్చిందే. గాల్ బ్లాడర్ క్యాన్సర్, లివర్ వ్యాధితో బాధపడుతుంటే ఆరోగ్యశ్రీ ద్వారా అపోలో ఆస్పత్రిలో సర్జరీ చేయించారు. 2007లో జరిగిన సర్జరీ ద్వారా నాకు రెండో జన్మ ప్రసాదించారు. ఆయన మన మధ్య లేడని మేము ఎప్పుడూ భావించడం లేదు. – ఎండీ షరీఫుద్ధీన్, సాలార్జంగ్ కాలనీ, మెహిదీపట్నం, హైదరాబాద్
ఫీజు రీయింబర్స్‌మెంట్ జీవితం మార్చింది
నేను 2007లో పదవ తరగతి పూర్తి చేశా. అమ్మానాన్న చదివించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం ద్వారా పాలిటెక్నిక్, బీటెక్ పూర్తి చేశా. మంచి ఉద్యోగం కూడా సంపాదించానని గర్వంగా చెబుతున్నా. నాలాంటి ఎంతోమంది పేదల జీవితాల్లో వైఎస్సార్ వెలుగులు నింపారు.
- ఎం.రవికుమార్, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా
‘మహానేత వైఎస్సార్’ సేవలు చిరస్మరణీయం
దార్శనికుడు, పేదల పక్షపాతి అంటూ కాంగ్రెస్ అగ్రనేతల కితాబు
వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం వైఎస్సార్ చేసిన కృషి అమోఘమని కొనియాడారు. రాహుల్ గాంధీ ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ఏపీ మాజీ సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నిజమైన రాజనీతిజ్ఞుడైన వైఎస్సార్.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. ఈ మేరకు తలపాగా ధరించి చిరునవ్వులు చిందిస్తున్న వైఎస్సార్ ఫొటోను రాహుల్ తన పోస్ట్‌కు జతచేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వైఎస్సార్‌కు నివాళులర్పించారు. దార్శనికుడు, కరుణామయుడైన నాయకుడు వైఎస్సార్ అని ఆయన అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, ప్రగతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. రైతులు, పేదలు, అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవధులు లేని నిబద్ధతతో పాటు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన చూపిన అపారమైన అంకితభావం శాశ్వత వారసత్వంగా నిలిచిపోతుందని ఖర్గే తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వైఎస్సార్ జీవితకాలంపై (8 జూలై 1949 – 2 సెప్టెంబర్ 2009) ముద్రించిన ప్రత్యేక చిత్రాన్ని ఖర్గే పంచుకున్నారు.
పేదల హృదయాల్లో వైఎస్‌ది చిరస్థాయి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
పంజగుట్ట (హైదరాబాద్): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా పంజగుట్ట వైఎస్సార్ కూడలిలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పూలమాలలతో ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ అమర్‌హై అంటూ నినాదాలు చేశారు.

అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎంపీ కె.వి.పి.రామచంద్రారావు, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్‌యాదవ్, మాజీ మంత్రి చిన్నారెడ్డితో కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు దేశానికే ఆదర్శమని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణించినా పేదల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారన్నారు.


