ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్. చిత్రంలో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి తదితరులు
వైఎస్సార్ అమర్ రహే నినాదాలతో మార్మోగిన ఘాట్ ప్రాంగణం
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా బుధవారం వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సంక్షేమ ప్రదాతగా, అభివృద్ధి విధాతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను వైఎస్ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు స్మరించుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్దకు మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకున్న వెంటనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది. 
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు.. ఆయనతో కరచాలనానికి పోటీ పడుతున్న దృశ్యం
ప్రార్థనల్లో వైఎస్ కుటుంబ సభ్యులు
వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, అత్తమ్మ డాక్టర్ సుగుణమ్మ, వైఎస్ సోదరుడు వైఎస్ సు«దీకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వీరితోపాటు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, బద్వేలు, ఆలూరు ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, విరూపాక్షి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్ బాషా, మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రెడ్డెప్పగారి రమేష్‌కుమార్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్ చాంద్ బాషా, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి, కడప, కర్నూలు మాజీ మేయర్లు కె.సురేష్‌బాబు, బీవై రామయ్య, కమలాపురం, కదిరి పార్టీ ఇన్‌ఛార్జిలు నరేన్ రామాంజులరెడ్డి, మగ్బూల్ బాషా, పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజోలి వీరారెడ్డి, సాయినాథ్ శర్మ, గోసుల శివభరత్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు, సాగు నీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, మహానేతగా వైఎస్సార్ ప్రజల
హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు.
మనసున్న, మరపురాని మహానేత వైఎస్సార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లి, పరిపాలనలో అందరూ సమానమేనని చాటుతూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని, పాలకుడంటే ఇలా ఉండాలని చాటి చెప్పిన మరపురాని మనసున్న మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వివిధ పార్టీల నేతలు కొనియాడారు. వైఎస్సార్ 77వ జయంతి వేడుకలను బుధవారం దేశవిదేశాల్లో ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు పండుగలా ఘనంగా నిర్వహించి, నివాళులర్పించారు. గ్రామ గ్రామాన, వాడవాడలా, నగరాల్లోనూ కేక్‌లు కట్ చేసి పేదలకు వస్త్ర, అన్నదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి మహానేతపై అభిమానాన్ని చాటుకున్నారు. ‘డాక్టర్ వైఎస్సార్ అమర్ రహే, జోహార్ వైఎస్సార్, వైఎస్సార్ ఆశయ సాధనే వైఎస్సార్‌సీపీ ధ్యేయం’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక పథకాలను ప్రజలు, అభిమానులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రగతిలో వైఎస్సార్‌కు ముందు.. ఆ తర్వాత అనే చరిత్రాత్మక మార్పు వచ్చిందని, నాడు కోట్లాది మందికి వైఎస్సార్ పెద్ద కొడుకులా అండగా నిలిచారని, అందుకే జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని నేతలు కొనియాడారు. రాజన్న పాదయాత్ర దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసేంత గొప్ప స్ఫూర్తినిచ్చిందన్నారు. కాంగ్రెస్‌ను జాతీయ స్థాయి లో రెండు సార్లు నిలబెట్టింది వైఎస్సార్ అని, ఆయ న బతికుంటే ప్రధాని స్థాయికి ఎదిగేవారన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం పరితపించి సుప రిపాలన అందించిన వైఎస్సార్‌ను ప్రజలు మరవలేరన్నారు. ప్రజా సమస్యలు వినడం, వాటికి పరిష్కా రం చూపటం వైఎస్సార్ నైజమని ప్రశంసించారు. 
ఏలూరులో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
ఇదీ వైఎస్సార్..
‘వైఎస్సార్ వ్యక్తిత్వం మహోన్నతమైనది. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలు గతంలో ఎవరూ ఊహించనివి. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడానికి అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోకపోయినా.. అమలు చేశారు. నాడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న ఒక చిన్నారి పెద్దయ్యాక సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై వైఎస్ జగన్‌ను కలవడం వైఎస్సార్ విజన్‌కి నిదర్శనం.’అని వైఎస్సార్‌సీపీ నేతలు కొనియాడారు.
ప్రకాశం జిల్లా గంగదొనకొండలో వైఎస్సార్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మహిళలు
పేదల జీవితాల్లో వెలుగు నింపారు
గచ్చిబౌలి (హైదరాబాద్): తామంతా బతికి ఉన్నామంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవేనని పలువురు వ్యాఖ్యానించారు. ఆయన ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ఎంతో మంది వైఎస్సార్ చేసిన మేలును గుర్తు చేసుకున్నారు. బుధవారం మాదాపూర్‌లోని బుట్టా కన్వెన్షన్‌లో వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఆతీ్మయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ వైఎస్సార్ మరణ వార్త విని తమ ఇంట్లో పిల్లలు సహా ఎవరూ అన్నం ముట్టలేదన్నారు. వైఎస్సార్‌తో మరిచిపోలేని అనుబంధం ఉందని చెప్పారు. ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..’ అనే పాట ఇచ్చినందుకు వైఎస్సార్ తనను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. 
వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్న వర ప్రసాద్‌రెడ్డి. చిత్రంలో వై.ఈశ్వర ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరులు
ఎంపీగా అవకాశం ఇస్తానంటే వద్దని చెప్పగా, కళారత్న అవార్డు ఇచ్చి గౌరవించారన్నారు. శాంతా బయోటెక్ చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘50 ఏళ్లకు ఓ పుణ్య పురుషుడు రావాలి. వైఎస్సార్ మహారుషి లాంటి మనిíÙ, మహా యోధుడు. వైఎస్సార్ లాంటి వ్యక్తి దేశానికి అవసరం..’ అని అన్నారు. వైఎస్సార్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి భాస్కరశర్మ మాట్లాడుతూ.. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్‌తో 17 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. సమస్యలకు వైఎస్సార్ అక్కడికక్కడే పరిష్కారం చూపించేవారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చక్రపాణిరెడ్డి, హఫీజ్‌ఖాన్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకర్, కారుమూరి వెంకట్‌రెడ్డి, శ్యామలారెడ్డి, వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సభ్యులు ఏపీ రెడ్డి, మల్లు సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పేదల పెన్నిధి వైఎస్‌కు ఘన నివాళి
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజల గుండెల్లో సంక్షేమ రథసారథిగా, నిరుపేదల పెన్నిధిగా చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు, శాసనమండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరై కార్యాలయ ప్రాంగణంలోని వైఎస్సార్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసిన అనంతరం, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నేతలు ప్రారంభించారు. 
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
బాబు పాలనలో కారు చీకట్లోకి రాష్ట్రం
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్సార్ వ్యక్తిత్వం, సమస్యల పట్ల ఆయన స్పందించే విధానం చిరస్మరణీయమని కొనియాడారు. వైఎస్సార్, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా చంద్రబాబుకు ఎక్కువ అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు. అయినా కేవలం ఐదేళ్లలోనే వైఎస్సార్ చరిత్ర సృష్టిస్తే.. ఎన్ని అవకాశాలొచ్చినా ఏమీ చేయకుండా చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం కారుచీకట్లోకి వెళ్లిందని మండిపడ్డారు. 2024లో అడ్డగోలు పొత్తులతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతం కంటే పదింతలు అబద్ధాలు చెప్పి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి పాతాళంలోకి నెట్టేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాకుండానే ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోపిడీ భయంకరంగా సాగుతోందని, ఎవరేం మాట్లాడినా, ఏం రాసినా అక్రమ అరెస్టులు, కేసులు పెడుతూ కారుచీకటి పరిస్ధితులు తెచ్చారని మండిపడ్డారు. ప్రస్తుత పాలకుల వల్ల ప్రజలకు వెలుగు విలువ తెలిసొచ్చిందని, రానున్న రోజుల్లో వైఎస్సార్ స్ఫూర్తితో వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని సజ్జల చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, పార్టీ నేతలు, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు.


