వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్ష విరమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.
వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్ష విరమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేడు సమావేశమయింది. ఆరోగ్యం బాగా క్షీణించినందున జగన్తో దీక్ష విరమింపజేయాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
సమావేశానంతరం పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో కలిసి కొణతాల రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం దీక్ష విరమించాలని దీక్ష విరమించాలన జగన్ను కోరాలని నిర్ణయించినట్టు కొణతాల తెలిపారు. జగన్ ఆరోగ్యం ఎంతో ముఖ్యమని చెప్పారు. పార్టీ ఆమోదించిన తీర్మానాన్ని జగన్కు విజయమ్మ అందజేస్తారని తెలిపారు. జైల్లో మొదలుపెట్టిన దీక్షను ఆస్పత్రిలోనూ జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొందని చెప్పారు.
రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి కాంగ్రెస్ ఆటలాడుతోందని కొణతాల విమర్శించారు. తమ రాజీనామాలతో కాంగ్రెస్ నిర్ణయం మార్చుకుంటుందని ఆశించామన్నారు. సమన్యాయం కోసం విజయమ్మ దీక్ష చేస్తే భగ్నం చేశారని తెలిపారు. దీంతో జగన్ జైల్లో దీక్షకు దిగారని వివరించారు. జగన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నందున దీక్ష విరమించాలని కోరారు.