108, 104 ఉద్యోగుల వేతనాల పెంపు | YS Jagan Reddy Hikes Salaries For 104 And 108 Employees | Sakshi
Sakshi News home page

108, 104 ఉద్యోగుల వేతనాల పెంపు

Nov 1 2019 5:43 AM | Updated on Nov 1 2019 10:35 AM

YS Jagan Reddy Hikes Salaries For 104 And 108 Employees - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. వారి వేతనాలను పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 108, 104 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలసి వేతనాలు పెంచాలని విన్నవించారు. వారి వినతి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. తమ కష్టాన్ని గుర్తించి వేతనాల పెంపుదలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇవ్వడం పట్ల హర్షం వెలిబుచ్చారు.

ప్రస్తుతం 108 వాహనాల్లో 2 వేలమందికిపైగా పనిచేస్తున్నారని, వీరిలో పైలెట్‌(డ్రైవర్‌)కు ప్రస్తుతం రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌)కి ప్రస్తుతం రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని రూ.30 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు. అలాగే 104 వాహనాల్లో సుమారు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం ఉండగా, దానిని రూ.26 వేలకు పెంచేందుకు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని చెప్పారు. తాము సర్వీస్‌ ప్రొవైడర్‌ కింద పని చేయలేమని విన్నవించగా.. అందర్నీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేసే విధంగా చేస్తామని సీఎం చెప్పారని వారు తెలిపారు.

మా కష్టాన్ని గుర్తించిన సీఎంకు కృతజ్ఞతలు..
మేం గత 14 సంవత్సరాలుగా 108 వాహనాల్లో పనిచేస్తున్నాం. మా కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. మా సమస్యల పట్ల ఇంతటి సానుకూలంగా వ్యవహరించిన జగన్‌కు సదా కృతజ్ఞులమై ఉంటాం. 108 వాహనాల ద్వారా మరింత మెరుగ్గా సేవలందించేందుకు కృషి చేస్తాం.
– 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌

జగన్‌ మేలును జన్మలో మర్చిపోం
ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలా కాకుండా వేతనాలు పెంచాలన్న మా విన్నపాన్ని మన్నించడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయన మేలును జన్మలో మరువబోము.    
– 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాచలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement