
నరసన్నపేట బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్(ఫైల్)
పది నియోజకవర్గాల్లో పల్లె వేదికగా పాదయాత్ర వేడుక కొనసాగింది. ప్రజా సంకల్ప యాత్ర సిక్కోలు మదిలో చెరగని గురుతులు నిలిపింది. సర్కారు నిర్లక్ష్యానికి బలైపోయిన ప్రజలకు తమ బాధలు చెప్పుకోగలిగే అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ నిరంకుశత్వానికి శిథిలమైపోయిన కుటుంబాలకు కన్నీరు తుడిచే నాయకుడిని చూపించింది. పన్నెండు జిల్లాల్లో దిగ్విజయంగా పాదయాత్ర నిర్వహించుకుని చివరి జిల్లాలో అడుగుపెట్టిన జగన్‌మోహనుడి ఆత్మీయ పలకరింపునకు సిక్కోలు ఫిదా అయిపోయింది. అడుగు అడుగునా అండగా నిలుస్తూ జనం రాజన్న బిడ్డకు నీరాజనం పలికారు. ప్రతి పలుకునకూ ప్రతిస్పందిస్తూ, పిలుపులను నినాదాలుగా మారుస్తూ పాదయాత్రను విజయవంతం చేశారు. ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది నవంబర్ 25న పాలకొండ నియోజకవర్గంలోని వీరఘట్టం మండలం కడకెల్ల వద్ధ జిల్లాలో తొలి అడుగు వేశారు. పాలకొండ నియోజకవర్గం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగిన ఈ పాదయాత్రలో తన వద్దకు వచ్చిన అన్ని వర్గాల వారినీ ఆప్యాయంగా పలకరించారు. వివిధ సామాజిక వర్గాలతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలు వినిపించగా.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. గిరిజనుల అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర, ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, తిత్లీ తుఫాన్ బాధితులకు పరిహారం పెంపు, ఉద్దాన కిడ్నీ బాధితులకు పింఛన్.. ఇలా బాధితులందరికీ న్యాయం చేస్తానంటూ ఇచ్ఛాపురం వరకు ప్రజా సంకల్పయాత్రను కొనసాగించారు.
పాలకొండ
పాదయాత్ర జరిగిన తేదీలు: నవంబర్ 25 నుంచి 29 వరకు
నడిచిన దూరం: 34 కిలోమీటర్లు
వీరఘట్టం/పాలకొండ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామంలో నవంబర్ 25న తొలి అడుగు వేశారు. ఐదు రోజుల పాటు జరిగిన పాదయాత్రలో స్థానిక సమస్యలు వింటూ బాధితులకు భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనోత్పత్తులకు గరిష్ట మద్దతు ధర కల్పించి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు.
రాజాం
పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 1 నుంచి 4 వరకు
నడిచిన దూరం: 37.5 కిలోమీటర్లు
రాజాం : నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు పాదయాత్ర సాగింది. డిసెంబర్ 3న రాజాం పట్టణ కేంద్రంలో జరిగిన సభలో విద్యారంగంలో పెరిగిన ఫీజులపై జననేత ప్రస్తావించారు. హెల్త్ అసిస్టెంట్లు తమకు ఉద్యోగ భద్రత లేదని చెప్పగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు, ఇండీట్రేడ్ బ్రోకర్ బాధితుల కష్టాలు.. ఇలా అన్ని వర్గాల సాధకబాధకాలను విని భరోసా కల్పించారు.
టెక్కలి
పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 18 నుంచి 23 వరకు
తిరిగిన దూరం: 46.2 కిలోమీటర్లు
టెక్కలి: మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలు చేసిన అరాచకాలు, అవినీతి కార్యకలాపాలను ప్రజలు ధైర్యంగా ప్రతిపక్ష నేత దష్టికి తీసుకువచ్చారు. పింఛన్లు అందక కొంత మంది, రేషన్ అందక మరికొంతమంది, జన్మభూమి కమిటీ సభ్యుల ఆగడాలకు బలైపోయిన బాధితులు జగన్‌కు కన్నీటి రూపంలో విన్నపాలు చేసుకున్నారు. 22న రావివలస గ్రామం నుంచి బర్మాకాలనీ, గోపినాథపురం, టెక్కలి వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఇదే సందర్భంలో పాదయాత్ర 3500 కిలోమీటర్లు మైలు రాయి చేరుకుంది. రావివలస గ్రామంలో మూతపడిన మెట్‌కోర్ ఫెర్రోఎల్లాయ్‌సెస్ పరిశ్రమ వద్ద కార్మికులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ఎచ్చెర్ల
పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 4 నుంచి 8 వరకు
తిరిగిన దూరం: 17 కిలోమీటర్లు
రణస్థలం: జి.సిగడాం మండలం గేదెలపేట వద్ద ప్రజానేతకు ఘనంగా స్వాగతం పలికారు. డిసెంబర్ 6న చిలకపాలెంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కళా వెంకటరావు అవినీతి చరిత్ర, దౌర్జన్యకాండను జగన్ ఎండగట్టారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన తీరు, తోటపల్లి కాలువ పనుల్లో జాప్యం, అంబేడ్కర్ యూనివర్సిటీ సమస్యలు.. ఇలా అన్ని సమస్యలు ప్రస్తావించారు.
ఆమదాలవలస
పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 5 నుంచి 12 వరకు
నడిచిన దూరం: 34 కిలోమీటర్లు
ఆమదాలవలస: పొందూరు మండలంలో ఖాదీ కార్మికులు జగన్‌ను కలిసి కష్టాలు వివరించగా, పొందూరులో ఖాదీ పరిశ్రమ నిర్మాణానికి చర్యలు చేపడతామని జగన్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 10, 11 12 తేదీల్లో ఆమదాలవలస పట్టణం, మండలంలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగింది. ఆమదాలవలస పట్టణంలో జరిగిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మూతపడిన సుగర్‌ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు.
నరసన్నపేట
పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 15 నుంచి 18
నడిచిన దూరం: 21 కిలోమీటర్లు
నరసన్నపేట: మడపాం వద్ద వంశధార నది సాక్షిగా నరసన్నపేట నియోజకవర్గంలోనికి వచ్చిన జగనన్నకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. 16న నరసన్నపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగట్టారు. నరసన్నపేట చరిత్రలోనే ఇంత భారీగా ప్రజలు పాల్గొన్న సభ ఇదేనని స్థానికులు చెబుతున్నారు. 18న చల్లపేట మీదుగా చిన్న కిట్టాలపాడు వరకూ దిగ్విజయంగా సాగిన ప్రజాసంకల్పయాత్ర టెక్కలి నియోజకవర్గంలోనికి ప్రవేశించింది. 17న పొందరులు, అగ్రికల్చరల్ విద్యార్థులు కలసి తమ సమస్యలను వివరించారు.
పాతపట్నం
పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 23 నుంచి 29
నడిచిన దూరం: 33.6 కిలోమీటర్లు
ఎల్.ఎన్.పేట: తమకు అండగా ఉండాలని ఆటో డ్రైవర్లు, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సమస్యలు పరిష్కరించాలని జీడి పరిశ్రమల కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారు ప్రజానేతకు సమస్యలు చెప్పుకున్నారు. 24న మెళియాపుట్టి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో అధికార పార్టీ వైఫల్యాలను, ఫిరాయింపు ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టారు.
శ్రీకాకుళం
పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 8 నుంచి 12 వరకు
నడిచిన దూరం: 25.8 కిలోమీటర్లు
శ్రీకాకుళం: నియోజకవర్గంలో ఐదు రోజుల పాటు జరిగిన పాదయాత్రలో పలు వర్గాల ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. 8న శ్రీకాకుళం నగరంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రుణంపై ఇళ్లను ఇస్తోందని, తాను మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వెంటనే రుణం రద్దు చేస్తానని పేదలకు హామీనిచ్చారు. కళింగ కోమట్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని ప్రకటించారు. వెలమ, కాళింగ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నైరలో వ్యవసాయ కళాశాల విద్యార్థులను కలిసి సమస్యలను తీర్చేందుకు హామీనిచ్చారు.
పలాస
పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 29 నుంచి జనవరి 2
నడిచిన దూరం: 44 కిలోమీటర్లు
కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలోకి రేగులపాడులో ఆఫ్‌షోర్ వద్ద ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించింది. 30న జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జీడి కార్మికులకు పది వేలు పింఛన్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, తిత్లీ బాధితులకు చెట్టుకు రూ.3వేలు, హెకార్టు జీడికి రూ.50వేలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. 1న వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానంలో తిత్లీ ప్రభావిత ప్రాంతంలో పాదయాత్ర కొనసాగించారు. దారి పొడవునా బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను పరిశీలించిన ప్రతిపక్ష నేత చలించిపోయారు. దీంతో కిడ్నీ రోగులకు 250 పడకలతో పరిశోధనా కేంద్రం, ఆస్పత్రి, కిడ్నీ రోగులకు రూ.10 వేలు పించన్ మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఇచ్ఛాపురం
పాదయాత్ర ప్రారంభమైన తేదీ: జనవరి 2
నడిచిన దూరం: 50 కిలోమీటర్లు
కంచిలి: రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జనవరి 2న సోంపేట మండల సరిహద్దు రాణిగాం గ్రామకూడలి వద్ద ప్రారంభమైంది. కంచిలి, కవిటి మండలాల మీదుగా సాగింది. తిత్లీ పరిహారంలో జరిగిన అన్యాయాన్ని ప్రజలు వివరించారు. అధికార పార్టీ నేతల అరాచకాలు, సంక్షేమ పథకాల అమలులో వివక్ష చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానంటూ జగన్ భరోసా ఇచ్చారు. 9న కొత్తకొజ్జిరియా నుంచి మొదలై పైలాన్ ఆవిష్కరణ అనంతరం ఇచ్ఛాపురం బస్టాండు కూడలిలో బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది.