ఉపేక్షించొద్దు: సీఎం జగన్‌

YS Jagan Orders On Illegal Mining Of Illicit Liquor And Sand At Amaravati - Sakshi

అక్రమ మద్యం, ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం ఆదేశాలు

గ్రామాల సమగ్రాభివృద్ధికి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం

ఇలాంటప్పుడు బెల్టుషాపులు మన ఉద్దేశాలను దెబ్బతీస్తాయి

గ్రామాల్లో 11 వేలకుపైగా ఉన్న మహిళా పోలీసులనుసమర్థవంతంగా వాడుకోవాలి

ఎక్సైజ్‌లో మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు వినియోగించాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్‌ షాపులు కనిపించకూడదని, అక్రమ మద్యం తయారీ అనేది ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా నిరోధంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రొహిబిషన్‌ – ఎక్సైజ్‌ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు. ఇన్ని విప్లవాత్మక కార్యక్రమాల మధ్య బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా లాంటివి మన ఉద్దేశాలను దెబ్బ తీస్తాయన్నారు.

గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సమీక్షలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే..

  • గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ ఉండకూడదు.
  • ఇసుక అక్రమ తవ్వకాలు.. అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు.
  • సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణా, మద్యం రవాణా ఉండకూడదు.
  • ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రొహిబిషన్‌ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాలి.
  • గ్రామాల్లో 11 వేలకు పైగా ఉన్న మహిళా పోలీసులతో పాటు మహిళా మిత్రలను సమర్థవంతంగా వాడుకోవాలి.
  • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో సిబ్బందిని పెంచండి. ప్రొహిబిషన్‌ – ఎక్సైజ్‌ శాఖలో మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పనుల కోసం వినియోగించాలి. కలిసి కట్టుగా ఫలితాలు సాధించాలి.
  • స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ తయారు చేసుకోవడం ద్వారా విధి నిర్వహణలో సమర్థత పెంచుకోవాలి. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top