నెల్లూరులో.. ముసల్మాన్‌.. ఖుష్‌

YS Jagan Mohan Reddy Want To  Give More Welfare Schemes To Muslim Minorities In Nellore - Sakshi

 మైనార్టీ సంక్షేమానికి వైఎస్సార్‌ 4 శాతం రిజర్వేషన్లు

 ముస్లింల  అభివృద్ధికి జగన్‌ హామీ

 వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఇమామ్, మౌజన్లకు వేతనం పెంపు

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అవస్థలు పడిన మైనార్టీలు

దశాబ్దాలుగా దగా పడిన ముస్లింలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో వాటాకు నోచుకోని ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌తో భరోసా కల్పించారు. మైనార్టీలకు ఫలాలు అందించి వారి జీవితాల్లో వెలుగు రేఖలు నింపారు. విద్య పరంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా వేలాది మంది ముస్లిం యువతను ఇంజినీరింగ్, డాక్టర్‌ వంటి ఉన్నత చదువులను కేవలం పేదరికమే ప్రామాణికంగా చదివించారు. ఇప్పుడు వారంతా ఆయా కొలువుల్లో స్థిరపడ్డారు. ఆయన అకాల మరణంతో ధైర్యాన్ని కోల్పోయిన ముస్లింలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు ఆశా కిరణంగా కనిపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలు జరిగే నవరత్నాల పథకాల ద్వారా అందరితో సమానంగా ముస్లింలు లబ్ధిపొందుతారు. ఆధ్యాత్మిక చింతనలో మనుగడ సాగిస్తున్న ఇమామ్, మౌజన్లు అరకొర గౌరవ వేతనాలతో స్థిరమైన ఆదాయం లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వీరికి గౌరవమైన వేతనాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. గడచిన ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ కాలంలో ముస్లింలు సంక్షేమ పథకాల అమలు, రుణ మంజూరులోనూ దగా పడ్డారు. రాజ్యాధికారంలో వివక్షకు గురయ్యారు. 

నెల్లూరు(వేదాయపాళెం):   దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలు బతుకులు మెరుగుపడ్డాయి. అప్పటి వరకు సంక్షేమానికి నోచుకోని మైనార్టీలకు ఆ ఫలాలను అందించి వారి జీవితాల్లో వెలుగు రేఖలు నింపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు వారి జీవన గమనానికి మార్గం చూపించారు. హఠాత్తుగా ఆయన మరణాంతరం వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఇప్పటి వరకు కేవలం స్థానికులు అందజేస్తున్న విరాళాలతోనే కుటుంబాలు వెళ్లదీస్తున్న ఇస్లామ్‌ బోధకులకు ప్రభుత్వ పరంగా అతి తక్కువ సాయం మాత్రమే అందుతోంది. ఇలాంటి తరుణంలో ప్రజాసంకల్ప యాత్రలో ముస్లింల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు.

తాను అధికారంలోకి రాగానే ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ప్రతి నెలా గౌరవ వేతనంగా అందిస్తానంటూ ప్రకటించారు. జిల్లాలో సుమారుగా 780 మసీదులు ఉన్నాయి. ఒక్కో మసీదుకు ఒక ఇమామ్, ఒక మౌజన్‌  పని చేస్తున్నారు. మొత్తంగా 2.25 లక్షల మైనార్టీల జనాభా ఉంది. వైఎస్సార్‌ మరణానంతరం వీరి సంక్షేమం ఎవరికీ పట్టకుండా పోయింది. చాలా చోట్ల మసీదులను చందాలతో నిర్మించుకునే పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చే ముస్లింలతో నమాజ్‌ చదివించే ఇమామ్‌లకు రూ.5 వేలు వాటి నిర్వాహణ చూసుకునే మౌజన్లకు రూ.3 వేలు ఇస్తుంటారు. ఈ మొత్తం ఎందుకూ చాలడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నారు.

 4 శాతం రిజర్వేషన్‌ అమలు శూన్యం ముస్లింలకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు చంద్రన్న పాలనలో ఏ మాత్రం అమలు కావడం లేదు. రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఎలాంటి ఉద్యోగ నియమాకాలు చేపట్టడం లేదు. అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ పద్థతిన భర్తీ అవుతున్న ఉద్యోగాలు కూడా రాజకీయ పలుకుబడి, డబ్బు ఉన్న వారికి మాత్రమే దక్కుతున్నాయి. మైనార్టీ వర్గాలకు 4 శాతం రిజర్వేషన్‌ వల్ల ఈ టీడీపీ పాలనలో ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు.

చంద్రన్న పెళ్లి కానుకతో మైనార్టీలకు కష్టాలు 

మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న దుల్హన్‌ పథకాన్ని నిర్వీర్యం చేసి, దాని స్థానంలో చంద్రన్న పెళ్లి కానుక ప్రవేశ పెట్టడం వల్ల మైనార్టీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుల్హన్‌ పథకంలో వివాహం అనంతరం నూతన ముస్లిం జంటలు దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సహకారం అందేది. ప్రస్తుతం చంద్రన్న పెళ్లి కానుకలో వివాహానికి 20 రోజుల ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు పలు రకాల నిబంధనలు పెట్టడం వల్ల నిరక్షరాస్యులైన మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఇబ్బంది పడుతున్నారు. దుల్హన్‌ పథకంలో 3,125 మంది లబ్ధి పొందగా, ప్రస్తుత చంద్రబాబు పాలనలో నిబంధనల కొర్రీలతో 1,367 మంది మాత్రమే చంద్రన్న పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రెండేళ్లుగా ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. 

విదేశీ విద్యకు తూట్లు 

జిల్లాలోని మైనార్టీల అభ్యన్నతికి టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మైనార్టీ విద్యార్థులు 15 దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు రూ.10 లక్షలు ఉపకార వేతనాన్ని మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు జిల్లా నుంచి 22 మంది ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 93 ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విదేశీ విద్యకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచగా, ముస్లిం, బీసీ విద్యార్థులకు రూ.10 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నట్లు జీఓ పేర్కొన్నారు. దీంతో ముస్లిం మైనార్టీ, బీసీ వర్గాల నాయకులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బాబు హామీలు.. నిబంధనల కొర్రీలు 

ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం పెంచుతామని రెండేళ్ల క్రితం సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే దీనికి ఎన్నో నిబంధనలు పెట్టారు. గౌరవ వేతనం అందుకోబోయేవారు పనిచేస్తున్న మసీదులకు భూములు, చరాస్తులు, ఆదాయ మార్గాలు ఏవీ ఉండరాదని, వక్ఫ్‌ బోర్డులో ఆ మసీదు రిజిస్టర్‌ అయి ఉండాలని, తదితర నిబంధనలు పెట్టారు. ఇలాంటి అర్థ రహిత కారణాలతో గౌరవ వేతనాలు ఇవ్వకుండా కొర్రీలు పెట్టారు. స్వయం ఉపాధి రుణాలు, నిధుల కేటాయింపులోను చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోంది. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఉన్నత చదువులు 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో వేలాది మంది మైనార్టీ విద్యార్థులు ఎంబీబీఎస్, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత విద్యను అభ్యసించారు. జిల్లాలో ఈ పథకం ద్వారా ఆయన పాలనలో సుమారు 20 వేల మంది పైగా ఇంజినీర్లు, డాక్టర్లు, వివిధ రంగాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు అమల్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. గత ఐదేళ్లలో 40,626 మందికి సంబంధించి రూ.69.94 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top