నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

YS Jagan Mohan Reddy Comments at Jayaho Book launch event - Sakshi

ప్రతీ క్షణం ఆ దిశగానే మా పరిపాలన 

సీనియర్‌ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి రచించిన ‘జయహో’ పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వరాదని ప్రతీ క్షణం ఆలోచిస్తూ ఆ దిశగా పరిపాలన సాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండగా తాను చేపట్టిన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్నిచ్చిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రపై సీనియర్‌ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి రచించిన ’జయహో’ పుస్తకావిష్కరణ సభ ఎమెస్కో ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ సాధారణంగా ఎన్నికల మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు పేజీలకు పేజీలు ముద్రిస్తాయని, వైఎస్సార్‌సీపీ మాత్రం రెండు పేజీల్లోనే ప్రజలకిచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపొందించిందని చెప్పారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని అమలుచేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. 19 బిల్లులు ఒకే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  

విజయవంతమైన యువనేత: శేఖర్‌ గుప్తా
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే విజయవంతమైన, యువకుడైన కొత్త తరం నాయకుడని ‘ది ప్రింట్‌’ ఎడిటర్‌ ఇన్‌చీఫ్, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత శేఖర్‌ గుప్తా పేర్కొన్నారు. జయహో పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మరెవరిలోనూ చూడని ఆత్మవిశ్వాసాన్ని తాను దివంగత వైఎస్సార్‌లో చూసినట్లు తెలిపారు. జగన్‌ రూపంలో వైఎస్సార్‌ వారసత్వం మన మధ్యే ఉందన్నారు. సొంతంగా ఓటింగ్‌ బలం ఉన్న 30 మంది ప్రాంతీయ నాయకులతో దేశం సుస్థిరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుగా నాలుగున్నర దశాబ్దాల తన వృత్తి జీవితంలో నూటికి నూరుపాళ్లు సంతృప్తినిచ్చిన కార్యక్రమం ‘జయహో’ పుస్తకరచన అని సీనియర్‌ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రచురణకర్త ఎమెస్కో విజయకుమార్‌ తదితరులు మాట్లాడారు. పాదయాత్ర ఫొటోలు తీసిన జర్నలిస్టులను ఈ సందర్భంగా అభినందించారు.

పాదయాత్ర గుర్తొస్తే గొప్ప ఉత్తేజం: ముఖ్యమంత్రి జగన్‌
‘పాదయాత్ర నిజంగానే గొప్ప అనుభవం. అంత దూరం నడిచానని గుర్తు చేసుకున్నప్పుడు గొప్ప ఉత్తేజం కలుగుతుంది. జగన్‌ వచ్చాడు.. మమ్మల్ని కలుస్తాడు... మా కష్టాలు చెప్పుకుంటామంటూ ప్రజలు వచ్చేవారు. మా కష్టాలు విన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తే వాటిని తీరుస్తాడనే వారి నమ్మకమే ఒక ఉప్పెనై అదే ఓటుగా మారింది. 50 శాతం ఓట్లతో రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని విజయాన్ని ప్రజలు అందించారు. దేవుడి ఆశీర్వాదంతో వారి నమ్మకాన్ని నిజం చేసేలా ముందుకు వెళుతున్నాం’’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top