గ్రామ సచివాలయం.. మహాత్ముడి కలల రూపం

YS Jagan Inaugurates village secretariat in East Godavari district Karapa - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటన

తూర్పు గోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన సీఎం

ముఖ్యమంత్రి దగ్గర్నుంచి వలంటీర్ల దాకా అంతా ప్రజా సేవకులే 

అవినీతి రహిత పాలనే ధ్యేయంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు

4 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప రికార్డు 

ఇకపై ప్రజలెవరూ వివక్షకు లోనయ్యే పరిస్థితి ఉండదు  

జనవరి నుంచి అందుబాటులోకి 500కుపైగా ప్రభుత్వ సేవలు  

సచివాలయాల వద్దనే ఎరువులు, విత్తనాల దుకాణం ఏర్పాటు  

మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల, ఆస్పత్రుల స్వరూపం మార్చేస్తాం

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేస్తాం

కరప నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గ్రామ సచివాలయాల వ్యవస్థను తూర్పు గోదావరి జిల్లా కరప మండల కేంద్రంలో బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సచివాలయ పైలాన్‌ను ఆవిష్కరించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. విధులు, బాధ్యతలపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభలో మాట్లాడారు. కేవలం 4 నెలల్లోనే అక్షరాలా 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండదని అన్నారు. ఇదొక గొప్ప రికార్డు అని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రజలపై అధికారం, అజమాయిషీ చెలాయించడానికి పెట్టలేదని అన్నారు. తన(ముఖ్యమంత్రి) దగ్గర్నుంచి వలంటీర్ల దాకా అంతా ప్రజలకు సేవకులేనని స్పష్టం చేశారు. కరప సభలో ముఖ్యమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘గాంధీజీ పేరు వినగానే గుర్తుకొచ్చే పదాలు అహింస, సత్యాగ్రహం.

భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని, గ్రామాలు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. అభివృద్ధి ఫలాలు, పరిపాలనను పల్లెల్లో  ప్రతి గడప దగ్గరికీ చేర్చాలనే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ప్రతి 2,000 జనాభాకు 10 నుంచి 12 మంది ప్రభుత్వ ఉద్యోగులను కొత్తగా నియమించాం. పరిపాలనలో అవినీతి, వివక్షకు తావులేకుండా చేయడానికే ఈ గ్రామ సచివాలయాలు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. గ్రామ సచివాయాల్లో దాదాపుగా 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 1వ తేదీకల్లా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. గ్రామ సచివాలయాల్లో అన్ని వసతులు, పరికరాలను అక్టోబరు, నవంబరు మాసాల్లోనే ఏర్పాటు చేస్తాం. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించేలా సేవలందిస్తామని సగర్వంగా తెలియజేస్తున్నా. వలంటీర్లకు స్మార్ట్‌ఫోన్‌ అందజేస్తాం. వారు గ్రామ సచివాలయంతో అనుసంధానమై పనిచేస్తారు. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి సేవలందిస్తారు. 

వివక్ష, అవినీతికి తావులేకుండా సేవలు  
3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో గ్రామాల పరిస్థితులను దగ్గరి నుంచి గమనించా. కనీస సదుపాయాలు కూడా లేకపోవడం గుర్తించా. రేషన్‌ కార్డు, పెన్షన్, ఇంటి స్థలం, ఇల్లు, మరుగుదొడ్డి.. ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితిని స్వయంగా చూశాను. ఎక్కడ చూసినా అవినీతి, వివక్షే తాండవించేది. జన్మభూమి కమిటీల ఆగడాలను గమనించా. ప్రజలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పనులు కావడం లేదని పాదయాత్రలో తెలిసింది. ఇలాంటి పరిస్థితులను మార్చాలి, ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేర్చాలన్న తాపత్రయం నుంచి పుట్టుకొచ్చినవే గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర వ్యవస్థ. ఇకపై ప్రభుత్వ సేవలు వివక్ష, అవినీతికి తావులేకుండా నేరుగా ప్రజలకే అందుతాయి. 
కరపలోని గ్రామ సచివాలయంలో ఉద్యోగులతో సీఎం వైఎస్‌ జగన్‌ 

ప్రతి ప్రభుత్వ పథకం మన ఇంటి దగ్గరికే.. 
గ్రామ సచివాలయం పక్కనే ఒక దుకాణం ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తాం. అలాగే ఒక వర్క్‌షాప్‌ కూడా ఏర్పాటు చేస్తాం. వ్యవసాయానికి సంబంధించిన అత్యుత్తమ విధానాలు, సహజ పద్ధతుల్లో సాగు వంటి వాటిపై రైతులకు శిక్షణ ఇస్తాం. ఆక్వా ప్రాంత గ్రామాల్లో ఆక్వా రంగానికి సంబంధించిన వర్క్‌షాప్‌ కూడా ఉంటుంది. నవరత్నాలతో సహా ప్రతి ప్రభుత్వ పథకం మన ఇంటి దగ్గరికే వస్తుంది. నేరుగా మన తలుపులు తట్టి పథకాలను డోర్‌ డెలివరీ చేస్తారు. ఇకపై ఎవరూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన పనిలేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలెవరూ వివక్షకు లోనయ్యే పరిస్థితి ఉండదు. జనవరి 1వ తేదీ వచ్చేసరికి అర్హత ఉన్న వారందరికీ కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తాం. ఇవన్నీ 72 గంటల్లోనే ఇచ్చేటట్టు చేస్తాం. 
కరపలో మహాత్మాగాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, వైఎస్సార్‌ విగ్రహాలకు నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి, విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు  

ఒక్క ఫోన్‌కాల్‌ చేస్తే చాలు... 
గత ప్రభుత్వం చేసిన తప్పులను చూశాం, అలాంటివి మన ప్రభుత్వంలో జరగకుండా గ్రామ సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థలు తీసుకొచ్చాం. మనం నిజాయతీగా పనిచేయాలి. మొన్నటి ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారు కూడా వచ్చే ఎన్నికల్లో మనకు ఓటేసేలా మన పరిపాలన ఉండాలి. ప్రజల్లో ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ప్రజల సౌకర్యార్థం ‘1902’ టోల్‌ఫ్రీ నంబర్‌తో కాల్‌సెంటర్‌ పెట్టాం. ఈ నంబర్‌ నేరుగా సీఎం పేషీకే కనెక్టై ఉంటుంది. వలంటీర్లు ఎవరైనా వివక్ష చూపినా, అవినీతికి పాల్పడినా ఒక్క ఫోన్‌కాల్‌ చేస్తే చాలు ప్రభుత్వం అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. గ్రామ వలంటీర్లుగా ఉన్న, సచివాలయాల్లో పని చేస్తున్న నా సొంత తమ్ముళ్లకు, నా సొంత చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా.. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి.  
కరపలో జరిగిన సభకు హాజరైన సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజలు   

పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు.. నాడు, నేడు 
మన రాష్ట్రంలో ప్రతి కుటుంబ బాగును కోరుకుంటూ ఈ నాలుగు నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించాం. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థ ద్వారా అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తాం. ప్రభుత్వానికి మూడేళ్ల సమయం ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారుస్తాం. ఇందులో గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. రాష్ట్రంలో దాదాపు 44,000 స్కూళ్లు ఉన్నాయి. సంవత్సరానికి 15,000 స్కూళ్ల చొప్పున ఫొటో తీస్తాం. ఆయా పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, మళ్లీ ఫొటో తీస్తాం. ఆ రెండింటిని నాడు, నేడు అని గ్రామ సచివాలయంలోని డిస్‌ప్లే బోర్డుల్లో పెడతాం. తేడా ఏమిటో మీరే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) మండల స్థాయిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు.. ఇలా అన్నింటిలోనూ మార్పు తీసుకురావాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు సర్కారు హయాంలో ప్రభుత్వ హాస్పిటళ్లు ఎంత దుర్భరంగా ఉండేవో మీకు తెలుసు. సంవత్సరానికి ఇన్ని హాస్పిటళ్లని తీసుకుంటాం. వాటిని ఫొటో తీస్తాం. అభివృద్ధి చేసిన తర్వాత మళ్లీ ఫొటో తీసి, మార్పు ఏమిటో ప్రజలకే చూపిస్తాం. 

రైతన్నలకు జగన్‌ అనే నేను తోడుగా ఉంటా.. 
పిల్లల చదువులు, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. జనవరి 26వ తేదీ వచ్చేసరికి ‘అమ్మఒడి’కి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువురాని వారు 33 శాతం మంది ఉన్నారు. అందరూ అక్షరాస్యులు కావాలి. తల్లులు తమ పిల్లలను బడికి పంపితే చాలు ‘అమ్మఒడి’ పథకం కింద సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఇచ్చి ప్రోత్సహిస్తాం. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు నేరుగా ఆ తల్లుల ఇళ్ల దగ్గరకు వెళ్లి, వాళ్ల చేతుల్లో ఈ సొమ్ము పెట్టి, పిల్లలను బడిబాట పట్టించే కార్యక్రమం చేస్తారు. రైతన్నలకు అండగా నిలిచేందుకు గ్రామ సచివాలయాలు, వలంటీర్లను తీసుకొచ్చాం. అక్టోబరు 15వ తేదీ వచ్చేసరికే ప్రతి రైతన్నకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది. జగన్‌ అనే నేను తోడుగా ఉంటాను. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాం. ఆటో, ట్యాక్సీ నడుపుకునే, సొంత టాక్సీ ఉన్న ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు జగన్‌ తోడుగా ఉంటాడు. ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారం అక్షరాలా 1.72 లక్షల మందికి రూ.10,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసే కార్యక్రమం ప్రారంభిస్తాం.  
తూర్పు గోదావరి జిల్లా కరపలో జరిగిన సభలో గ్రామ సచివాలయాల ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులు  

మద్యంపై ఇక సమరమే 
రాష్ట్రంలో ఇంతకు ముందు మద్యం దుకాణాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. అక్షరాలా 4,580 షాపులు ఉండేవి. వాటికి అనుసంధానంగా 43,000 బెల్టుషాపులు గతంలో మనకు కనిపించేది. గ్రామాల్లో మంచినీరు ఉండేదో లేదో గానీ మద్యం దుకాణాలు మాత్రం ఎక్కడపడితే అక్కడ దర్శనమిచ్చేవి. మహాత్మాగాంధీని స్ఫూర్తిని తీసుకుని ఏ గ్రామంలోనూ మద్యం బెల్టుషాపులు లేకుండా రద్దు చేసిన ప్రభుత్వం మాది అని సగర్వంగా చెబుతున్నా. ఈ బెల్టుషాపులు మళ్లీ పుట్టుకురాకుండా చేయడానికి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపే కార్యక్రమం చేస్తోంది.  గతంలో 4580 మద్యం దుకాణాలు ఉండగా, ఈ రోజు వాటిని 3,450కి తగ్గించాం. అంటే 20 శాతం షాపులు తగ్గించాం. ఇంతకుముందు మద్యం షాపులు ఉన్న దారిలో నడవాలంటే అక్కాచెల్లెమ్మలు భయపడే పరిస్థితి ఉండేది. అందుకే పర్మిట్‌ రూంలు పూర్తిగా రద్దు చేశాం. గతంలో రాత్రి 10 అయినా, 11 గంటలు అయినా మద్యం అందుబాటులో ఉండేది. ఆ పరిస్థితిని మార్చాం. మద్యం దుకాణాలను 11 గంటలకు తెరిచి, రాత్రి 8 అయ్యేసరికి పూర్తిగా మూసేయ్యాలని ఆదేశించాం. అంతేకాదు మద్యంపై పోరాటం చేస్తూ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సచివాలయంలో అక్కాచెల్లెమ్మళ్లను పోలీసులుగా తీసుకొచ్చాం. వారిపై పెద్ద బాధ్యత పెట్టాం. గ్రామాల్లో ఎక్కడైనా లిక్కర్‌ అనేది కనిపించినా, ఎవరైనా మద్యం అమ్ముతున్నా ఒక్క ఫోన్‌ కొట్టండి చాలు ప్రభుత్వం కదులుతుందని తెలియజేయడానికి ఆ అక్కాచెల్లెమ్మలకు పోలీసులుగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చాం. మద్యం నియంత్రణకు వారు కృషి చేస్తారు. 

ప్రజల బాటను ప్రభుత్వం వీడదు 
రైతులకు, రైతుకూలీ కుటుంబాలకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. పేద పిల్లల చదువులకు భరోసాగా, వైద్యానికి హామీగా ప్రభుత్వం ఉంటుంది. పేదలకు దాదాపుగా ఉగాది నాటికల్లా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తాం. అక్కాచెల్లెమ్మల పేరుతోనే వాటిని రిజిస్ట్రేషన్‌ చేస్తాం. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నామినేటెడ్‌ పదవుల్లో ఏకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా, దేశం మొత్తం మనవైపు చూసేలా ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే. ప్రజల బాటను ప్రభుత్వం ఎన్నటికీ వీడదు. ప్రజల బాగు కోసమే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. వాటిని పూర్తిగా ఉపయోగించుకోవాలి’’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ప్లాస్టిక్‌ను వదిలేద్దాం.. 
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఒకసారి వినియోగించి వదిలేసే(సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ను విడిచిపెట్టి జ్యూట్, క్లాత్‌తో తయారయ్యే సంచులను వాడుకోవడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు సైతం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు వంగా గీత, చింతా అనూరాధ, మార్గాని భరత్‌రామ్, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, సీఎం ప్రొగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top